దృశ్యం-2.. ఎక్క‌డ ఆగిందో అక్క‌డి నుంచే

మ‌ల‌యాళ సినిమా స్థాయిలో ఎంతో పెంచిన సినిమాల్లో దృశ్యం ఒక‌టి. అప్ప‌టికి అక్క‌డి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల రేంజ్ 30 కోట్ల‌కు అటు ఇటుగా ఉంటే మోహ‌న్ లాల్ న‌టించిన ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ క్ల‌బ్బులో అడుగు పెట్టి ఔరా అనిపించింది. ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రీమేక్ అయి అక్క‌డా మంచి విజ‌యం సాధించింది. సౌత్ ఇండియాలో వ‌చ్చిన బెస్ట్ థ్రిల్ల‌ర్ల‌లో ఒక‌టిగా దృశ్యం గుర్తింపు సంపాదించింది.

ఈ చిత్రానికి సీక్వెల్ తీయాల‌ని గ‌త ఏడాది లాక్ డౌన్ అనంత‌రం హీరో మోహ‌న్ లాల్, ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ అనుకున్నారు. వెంట‌నే సినిమాను మొద‌లుపెట్టి నెల‌న్న‌ర తిరిగేస‌రికి షూటింగ్ పూర్తి చేశారు. సినిమా మొద‌ల‌వ‌డానికి ముందే అమేజాన్ ప్రైమ్‌తో డీల్ కుదిరింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రిమియ‌ర్స్ క‌న్ఫ‌మ్ అయ్యాయి. ట్రైల‌ర్ కూడా వ‌చ్చేసింది.

ఈ నెల 19న అమేజాన్ ప్రైమ్ దృశ్యం-2ను రిలీజ్ చేయ‌బోతోంది ప్రైమ్. ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. దృశ్యం క‌థ ఎక్క‌డ ఆగిందో అక్క‌డి నుంచి దృశ్యం-2 మొద‌లు కాబోతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌న కూతురిని వేధించిన కుర్రాడిని చంపేసి ఆ కేసు నుంచి తెలివిగా బ‌య‌ట‌ప‌డ్డ జార్జ్ కుట్టి.. సంతోషంగా జీవ‌నం సాగిస్తుంటాడు. కానీ కొత్త‌గా ఆ ఏరియాకు వ‌చ్చిన పోలీస్ అధికారి ఈ కేసును తిర‌గ‌దోడ‌తాడు. జార్జ్ మీద అనుమానం ఉన్న వాళ్ల‌ను విచారించి, అత‌డికి వ్య‌తిరేకంగా సాక్ష్యాలు సేక‌రించ‌డం మొద‌లుపెడ‌తాడు.

ప‌రిశోధ‌న‌లో భాగంగా జార్జి ఎలా అబ‌ద్ధ‌పు సాక్ష్యాల‌తో కేసును తారుమారు చేశాడో తెలిసి అత‌డి కుటుంబాన్ని మ‌ళ్లీ విచార‌ణ పేరుతో ఇబ్బంది పెడుతుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. మ‌నం చ‌చ్చే వ‌ర‌కు ఈ కేసు మ‌న‌ల్ని వ‌ద‌ల‌దంటూ జార్జ్ భార్య‌కు చెప్పి మ‌ళ్లీ త‌న పోరాటాన్ని మొద‌లుపెడ‌తాడు. మ‌రి ఈ కేసులో కొత్త మ‌లుపులేంటి.. జార్జికి ఎదురైన స‌వాళ్ల నుంచి అత‌నెలా బ‌య‌ట‌ప‌డ్డాడు అన్న‌ది మిగ‌తా క‌థ. ట్రైల‌ర్ చూస్తే ఫ‌స్ట్ పార్ట్ అంత ఎగ్జైటింగ్‌గా లేదు. మ‌రి లాల్-జీతు ఈ సారి ప్రేక్ష‌కుల‌ను ఎలా మెస్మ‌రైజ్ చేస్తారో చూడాలి.