క్రిష్ రిలీజ్ డేట్ ఎందుకు చెప్ప‌లేదు?

అదిగో సినిమా అంటే… ఇదిగో రిలీజ్ డేట్ అన్న‌ట్టు త‌యారైంది టాలీవుడ్ య‌వ్వారం. అందుకే రిలీజ్ డేట్ల జాత‌ర కొన‌సాగుతోంది. అంతెందుకు… సినిమా మొద‌లెట్ట‌కుండానే, అక్టోబ‌రు 1న సినిమా విడుద‌ల చేస్తున్నాం, అంటూ షాకిచ్చాడు మారుతి.

ఇలా.. అంతా రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించుకోవ‌డంలో బిజీ అయిపోయారు. క్రిష్ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. అటు ప‌వ‌న్ సినిమా రిలీజ్‌డేట్ రాలేదు, ఇటు వైష్ణ‌వ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్ప‌లేదు.

ప‌వ‌న్ సినిమా 2022లోనే అని టాక్‌. వైష్ణ‌వ్ తేజ్ – ర‌కుల్ ప్రీత్ సింగ్ ల‌తో క్రిష్ ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా దాదాపు అయిపోయింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంకా రాలేదు. దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. ఈసినిమాకి గ్రాఫిక్స్ తో చాలా ప‌ని ఉంది. అందుకోసం దాదాపు 4 నెల‌లు స‌మ‌యం కేటాయించాల‌ట‌. గ్రాఫిక్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? ఆ ప‌నులు ఓ ప‌ట్టాన తెవ‌ల‌వు. 4 నెల‌లు అనుకున్న‌ది కాస్త 6 నెల‌లు అవ్వొచ్చు. అది గ్రాఫిక్స్ కంపెనీ నైపుణ్యం పై ఆధార‌ప‌డి ఉంటుంది. గ్రాఫిక్స్ న‌చ్చ‌క‌పోతే.. తిరిగి మ‌ళ్లీ చేయించుకోవాలి.

అందుకే…విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌నులు అయ్యేంత వ‌ర‌కూ… ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్ప‌కూడ‌ద‌ని క్రిష్ ఫిక్స‌య్యాడ‌ని టాక్‌. కొండ‌పొలెం అనే ప్ర‌సిద్ధ‌మైన న‌వ‌ల ఆధారంగా ఈసినిమా తెర‌కెక్కుతోంది. అట‌వీ నేప‌థ్య‌మైన స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అవ‌న్నీ గ్రాఫిక్స్ లోనే తీయాలి. అన్న‌ట్టు ఈ సినిమాకి జంగిల్ బుక్‌ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు.