నాలుగేళ్ల చర్చలు ఫలించాయ్.. వెంకీతో ఆ దర్శకుడు


పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. తెలుగు వారినే కాక ఇతర భాషల వాళ్లనూ ఆకట్టుకున్న ఆ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మరెన్నో కొత్త కథలకు దారి చూపించింది. దీని తర్వాత తరుణ్ ఎలాంటి సినిమాలు తీస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ ‘పెళ్ళిచూపులు’ విడులయ్యాక నాలుగున్నరేళ్లలో తరుణ్ నుంచి ఒకే సినిమా వచ్చింది. ‘ఈ నగరానికి ఏమైంది’ పేరుతో తెరకెక్కిన ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు.

‘పెళ్ళిచూపులు’ చిత్రాన్ని విడుదల చేసిన సురేష్ ప్రొడక్షన్స్‌లోనే తరుణ్ ఓ పెద్ద సినిమా చేస్తాడని, అందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తాడని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ‘పెళ్ళిచూపులు’ తర్వాత తరుణ్ తీయాల్సిన సినిమా కూడా అదే. కానీ ఆ సినిమాపై ఎంతకీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇలాగే నాలుగేళ్లకు పైగా గడిచిపోయాయి.

ఐతే ఎట్టకేలకు తరుణ్-వెంకీ కలయికలో సినిమాకు అన్ని అడ్డంకులూ తొలగిపోయి అతి త్వరలోనే అది పట్టాలెక్కబోతోందని సమాచారం. గుర్రపు పందేల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు నిర్మాత సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. స్క్రిప్టు ఓకే అయిందని, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. మే లేదా జూన్‌లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.

ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్‌లో ‘నారప్ప’ సినిమాను పూర్తి చేశాడు వెంకీ. ఈ సినిమా మే 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అది పూర్తి కాగానే ‘ఎఫ్-3’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ఈ సీనియర్ హీరో. అది మే-జూన్ మధ్య పూర్తవుతుందని అంటున్నారు. ఆ చిత్రం ఆగస్టు 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్-3’ అవ్వగానే తరుణ్ సినిమా మీదికి వెళ్లిపోతాడు వెంకీ. ఈ ఏడాదే ఈ సినిమా కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల ఉండొచ్చేమో.