చెక్కు చెదరని తరుణ్ భాస్కర్ బ్రాండు

తరుణ్ భాస్కర్ తొలి చిత్రం ‘పెళ్ళి చూపులు’ రిలీజైంది 2016లో. తర్వాతి పదేళ్లలో అతను తీసింది మూడంటే మూడు సినిమాలు. రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లలో ఆశించిన ఫలితాన్నందుకోలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన ‘కీడా కోలా’ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. దీని తర్వాత మళ్లీ తరుణ్ కొంచెం గ్యాప్ తీసుకుని ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ తీశాడు.

ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా.. టీం ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేదు. ప్రమోషన్లు కూడా ఏమీ చేయలేదు. రిలీజ్ ముంగిట ట్రైలర్ రిలీజ్ చేసింది. తర్వాత సినిమాను ప్రమోట్ చేసింది. రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు వరకు కూడా సినిమాకు ఏమంత హైప్ ఉన్నట్లుగా కనిపించలేదు. కానీ విడుదలకు ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే.. ప్రేక్షకులు ఒక్కసారిగా ఎగబడిపోయారు. ఎన్ని షోలు వేస్తే అన్నీ హౌస్ ఫుల్స్ అయిపోయాయి.

కానీ ఈ షోల నుంచి టాక్ అయితే పాజిటివ్‌గా ఏమీ రాలేదు. రివ్యూలు కూడా మోడరేట్‌గానే వచ్చాయి. కానీ ఈ ప్రభావం సినిమా మీద ఎంతమాత్రం కనిపించలేదు. తొలి రోజు, ఆ తర్వాత కూడా ‘ఈఎన్ఈ రిపీట్’ అంచనాలకు మించిన వసూళ్లతో దూసుకెళ్తోంది. యుఎస్‌లో ఈ సినిమా ఆల్రెడీ మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగుపెట్టేసింది. తెలుగు  రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. తరుణ్ భాస్కర్ బ్రాండు ఎంత స్ట్రాంగ్ అన్నది ‘ఈఎన్ఈ రిపీట్’ రుజువు చేస్తోంది. 

‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజైనపుడు ఒక మాదిరిగా ఆడినా.. తర్వాత అది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఆన్ లైన్లో ఈ సినిమాను రిపీట్స్‌లో చూశారు కుర్రాళ్లు. ఈ చిత్రాన్నికొన్నేళ్ల ముందు రీరిలీజ్ చేస్తే స్పందన ఊహించని స్థాయిలో వచ్చింది. ఆ సినిమాకు వైబ్ అయిన వాళ్లంందరికీ ‘ఈఎన్ఈ రిపీట్’ మాండేటరీ అయిపోయింది. ‘ఈ నగరానికి ఏమైంది’తో పోలిస్తే కంటెంట్ కొంచెం తగ్గినా సరే.. ఈ సినిమాకు యువ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.