సుక్కును ఇరికించేసిన బన్నీ

ఈ ఉదయం ‘పుష్ప’ టీం పెద్ద షాకే ఇచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్‌ల కలయికలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘పుష్ప’ షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. సుకుమార్ ఓ సినిమాను ఎలా చెక్కుతాడో అందరికీ తెలిసిందే కాబట్టి ఈ చిత్రం ఇంత త్వరగా విడుదలవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఈ ఏడాది ఆ చిత్రం విడుదల కాదని అనుకున్న వాళ్లూ ఉన్నారు. కొంచెం వేగం చూపించినా దసరా సమయానికి కానీ సినిమా రెడీ కాదని అనుకుంటున్నారు. అలాంటిది ఆగస్టు 13కే రిలీజ్ అనేసరికి నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పుడు డేట్ ఇచ్చినా.. దాన్ని అందుకుంటారన్న గ్యారెంటీ లేదు అని అభిప్రాయపడుతున్న వాళ్లూ లేకపోలేదు. ఐతే హీరో అల్లు అర్జున్, నిర్మాతల ఒత్తిడికి సుకుమార్ తలొగ్గక తప్పలేదన్నది ఇన్ సైడ్ టాక్.

సుకుమార్ ఇంతకుముందు ఏ సినిమాలకూ లేని స్థాయిలో ‘పుష్ప’ను వేగం చూపిస్తున్నాడట. రోజువారీ తీసే సన్నివేశాల సంఖ్య, ఫుటేజ్ పెరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలోనే చాలా ఆలస్యం జరిగింది. ఈలోపు ప్రి ప్రొడక్షన్ దశలోనే కోట్లు ఖర్చయిపోయాయి. లాక్ డౌన్ టైంలో పని లేకున్నా టీం అంతటికీ జీతాలివ్వాల్సి వచ్చింది. షూటింగ్ కూడా నెమ్మదిగా చేస్తే ఖర్చు బాగా ఎక్కువైపోతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు ‘అల వైకుంఠపురములో’కు ముందు చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్న బన్నీకి.. ఆ సినిమా తర్వాత కూడా చాలానే విరామం వచ్చింది. దీని వల్ల తనకెంతో నష్టం జరుగుతోందని అర్థం చేసుకున్న బన్నీ.. ‘పుష్ప’ మేకింగ్ ఆలస్యం కాకూడదని గట్టిగా ఫిక్సయ్యాడట. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసి మే కల్లా ఖాళీ అయిపోతుండటంతో సాధ్యమైనంత త్వరగా ఆయనతో తాను చేయాల్సిన సినిమాను మొదలుపెట్టాలని.. ఆయనకు కూడా ‘ఆచార్య’కు ముందు చాలా విరామం వచ్చిన నేపథ్యంలో తన కోసం వెయిట్ చేయించొద్దని బన్నీ నిర్ణయించుకున్నాడట. అందుకే నిర్మాతలతో కలిసి సుక్కు మీద ఒత్తిడి తెచ్చి తన వైపు నుంచి ఎంత టైమ్ ఇవ్వడానికైనా, ఎంత కష్టపడటానికైనా సిద్ధమని చెప్పి సినిమాను ఆగస్టు 13నే విడుదల చేసేలా ప్లాన్ చేయించి, ప్రకటన చేయించినట్లు సమాచారం. డేట్ ఇచ్చేయడంతో ఇక సుక్కు ఆలస్యం చేయకుండా జూన్ నెలాఖరుకల్లా షూటింగ్ ముగించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిసింది.