చిరు మీమ్ మీద మీమ్సే మీమ్స్


మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్లోకి అడుగు పెట్టి ప‌ది నెల‌లు అవుతోంది. ఆయ‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంద‌డి మామూలుగా లేదు. నిన్న‌టి త‌రం సీనియ‌ర్ హీరో కదా.. సైలెంటుగా ఉంటాడు, అభిమానుల‌తో పెద్దగా ట‌చ్‌లో ఉండ‌డు అని చాలామంది అనుకున్నారు కానీ.. చిరు మాత్రం కుర్ర హీరోలు కూడా చూపించ‌ని స్పీడు చూపిస్తున్నారు ట్విట్ట‌ర్లో. త‌ర‌చుగా ఏదో ఒక అప్ డేట్ ఇవ్వ‌డం.. వీడియోలు పెట్ట‌డం.. త‌మాషా చేయ‌డం ద్వారా త‌న ఫాలోవ‌ర్ల‌ను భ‌లేగా ఎంగేజ్ చేస్తున్నారాయ‌న‌.

ఇప్పుడు ఆచార్య టీజ‌ర్ అప్‌డేట్‌కు సంబంధించిన ఆయ‌న పెట్టిన మీమ్ అయితే ట్విట్ట‌ర్‌లో విప‌రీతంగా వైర‌ల్ అయింది. ఇంత‌కుముందు అనుకోకుండా ఓ వేడుక‌లో ఆచార్య సినిమా టైటిల్ లీక్ చేసేసిన చిరు.. దాన్ని గుర్తు చేస్తూ టీజ‌ర్ అప్‌డేట్ ఇవ్వ‌క‌పోతే లీక్ చేస్తా అంటూ ఫ‌న్నీగా కొర‌టాల‌కు వార్నింగ్ ఇచ్చిన మీమ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

చిరు పెట్టిన‌ మీమ్ మీద మ‌రెన్నో మీమ్స్ త‌యార‌వుతున్నాయి. చిరు మీమ్ చూసి మీమ్ క్రియేట‌ర్లంద‌రూ ఇక మేం సెల‌వు తీసుకుంటాం బాస్ అంటూ అదుర్స్‌లో బ్ర‌హ్మి అవ‌తారంలో ఫీల‌వుతున్న మీమ్ ఒక‌టి న‌వ్వులు పూయిస్తోంది. అలాగే అత‌డు సినిమాలో భూమిక మెడ‌పై మ‌హేష్ క‌త్తి పెట్టి ప్ర‌కాష్ రాజ్‌ను బెదిరించే దృశ్యం పెట్టి అందులో భూమిక‌ను క‌థ‌గా స్టోరీగా పేర్కొంటూ.. కొర‌టాల అప్‌డేట్ ఇవ్వ‌కుంటే క‌థంతా లీక్ చేసేస్తాన‌ని చిరు బెదిరిస్తున్న‌ట్లు పెట్టిన మీమ్ సైతం న‌వ్విస్తోంది.

మీకంద‌రికీ పీఆర్వోలు కావాలి.. కానీ నా సినిమాకు ప‌బ్లిసిటీకి ఈ మీమ్ ఒక్క‌టి చాలు అని చిరు స‌వాల్ చేస్తున్న‌ట్లుగా కూడా ఒక మీమ్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇలాంటి ఫ‌న్నీ మీమ్స్ మ‌రెన్నో ట్విట్ట‌ర్లో క‌నిపిస్తున్నాయి. మొత్తానికి ఆచార్య అప్‌డేట్ గురించి చిరు పెట్టిన మీమ్ పెద్ద చ‌ర్చ‌నీయాంశంగానే మారింది సోష‌ల్ మీడియాలో.