టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఇకపై ఆయన రాజకీయాల్లో ఉండరట. తనకు రాజకీయాలకు సంబంధమే లేదని ఆయన తేల్చేశారు. రాజకీయాల నుంచి రిటైరైపోయానని అనేశారు. అలాగని ఆయన పూర్తిగా విశ్రాంతికి పరిమితం కావడం లేదు. సినిమాల్లో యాక్టివ్ అవుతారట. నటుడిగా సినిమాలు చేస్తూనే.. తన జయభేరి ప్రొడక్షన్స్ బేనర్లో మళ్లీ సినిమాలు నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు.
జయభేరి సంస్థలో ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమాలే తీశారాయన. నాగార్జున హీరోగా నటించిన నిర్ణయం, ఆవిడా మా ఆవిడే చిత్రాలు ఈ బేనర్లో తెరకెక్కినవే. చివరగా 2005లో వచ్చిన ‘అతడు’ సినిమాతో జయభేరి బేనర్‌కు బ్రేక్ పడింది. తెలుగు సినీ చరిత్రలో ఒక క్లాసిక్ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఆడలేదు. అలాగని జయభేరికి ఈ సినిమా వల్ల నష్టాలు కూడా రాలేదు. అయినా అనూహ్యంగా ‘అతడు’ తర్వాత సినిమాల నిర్మాణం ఆపేసింది జయభేరి సంస్థ.
మళ్లీ ఇన్నేళ్లకు జయభేరి సంస్థను పున:ప్రారంభించనున్నట్లు మురళీ మోహన్ వెల్లడించారు. ఈ సంస్థలో ఎలాంటి సినిమాలు నిర్మించాలి.. సినిమాలకే పరిమితం కావాలా వెబ్ సిరీస్‌లు కూడా రూపొందించాలా అన్నది చర్చిస్తామని మురళీ మోహన్ తెలిపారు. ‘‘ఇప్పటి వరకు మా జయభేరి సంస్థలో 25 సినిమాలు వచ్చాయి. ‘అతడు’ మా చివరి సినిమా. ఆ తర్వాత నేను వ్యాపారాలు, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమాలు నిర్మించలేకపోయాం. ఇకపై నా దృష్టంతా నటన, సినిమాల నిర్మాణం పైనే. సినిమాలు ఎంతలో తీయాలి.. చిన్న బడ్జెట్టా పెద్ద బడ్జెట్టా… ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లా సినిమాలా అనేదీ ఆలోచిస్తున్నాం. ఏదో ఒకటి త్వరలోనే మొదలుపెడతాం’’ అని మురళీ మోహన్ చెప్పారు. ప్రస్తుతం తాను ఆర్కా మీడియా వాళ్లు రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నానని.. ఇందులో తన కొడుకులుగా జగపతిబాబు, శరత్ కుమార్ నటిస్తున్నారని మురళీ మోహన్ వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates