ఈవీవీ లేని లోటు.. ఇప్ప‌టికీ


తెలుగు సినిమా చ‌రిత్ర‌లో కామెడీ అనే అధ్యాయంలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక పేజీని లిఖించుకున్న ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌. త‌న గురువు జంధ్యాల‌కు దీటుగా ఆయ‌న కామెడీ పండించారు. కెరీర్లో ఎక్కువ‌గా ఆ జాన‌ర్లోనే సినిమాలు తీశారు. ప్ర‌పంచంలోనే మ‌రే ఇండ‌స్ట్రీలో లేని విధంగా తెలుగు ప‌రిశ్ర‌మ ఒక స‌మ‌యంలో ప‌దుల సంఖ్య‌లో క‌మెడియ‌న్లతో క‌ళ‌క‌ళ‌లాడిందంటే అందులో ఈవీవీ పాత్ర కూడా కీల‌కం.

ఆయ‌న సినిమాల్లో ఎప్పుడూ రెండంకెల సంఖ్య‌లో క‌మెడియ‌న్లు ఉండేవాళ్లు. వాళ్లంద‌రికీ మంచి పాత్ర‌లుండేవి. కామెడీ డోస్ ఓ రేంజిలో ఉండేది. త‌న కొడుకు అల్ల‌రి న‌రేష్‌కు కూడా కామెడీ సినిమాల‌తో ఎన్నో హిట్లు ఇచ్చాడు ఈవీవీ. ఆయ‌న చ‌నిపోయి ఈ జ‌న‌వ‌రి 21 నాటికి ప‌దేళ్లు పూర్త‌యింది. టీవీల్లో ఆయ‌న సినిమాలు వ‌చ్చిన‌పుడ‌ల్లా ప్రేక్ష‌కులు క‌డుపుబ్బ న‌వ్వుకుని ఈవీవీ చాలా త్వ‌ర‌గా వెళ్లిపోయారే అనుకుంటూ ఉంటారు.

ఇక ఈవీవీ లేని లోటు మ‌రింత‌గా క‌నిపించేది ఆయ‌న త‌న‌యుడు న‌రేష్ సినిమాలు చూసిన‌పుడే. తండ్రి వెళ్లిపోయిన త‌ర్వాతి ఏడాది నుంచే న‌రేష్ కెరీర్ గాడి త‌ప్పింది. సుడిగాడు మిన‌హాయిస్తే అత‌డి కెరీర్లో హిట్లు క‌ర‌వ‌య్యాయి. ఈవీవీ ఉండ‌గా.. మ‌ధ్య మ‌ధ్య‌లో న‌రేష్‌కు ఫ్లాపులు వ‌చ్చినా ఆయ‌న వెంట‌నే చెయ్యిచ్చి ఆదుకునేవారు. మంచి కామెడీ సినిమాతో అత‌ణ్ని ట్రాక్‌లోకి తెచ్చేవారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం న‌రేష్ కెరీర్‌ను గాడిన పెట్టేవాళ్లే లేక‌పోయారు. అత‌ను ఫ్లాపుల్లో ప‌డి కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు.

తాజాగా న‌రేష్ నుంచి బంగారు బుల్లోడు సినిమా వ‌చ్చింది. ఇది కూడా ప్రేక్ష‌కుల తిర‌స్కారానికి గురైన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ సినిమా చూస్తున్నంత‌సేపూ గ‌తంలో న‌రేష్‌తో ఈవీవీ చేసిన రూర‌ల్ కామెడీ సినిమాలే గుర్తుకొచ్చి ఉంటాయి ప్రేక్ష‌కుల‌కు. ఇదే క‌థ ఈవీవీ చేతిలో ప‌డితే.. త‌న మార్కు వెట‌కారాన్ని, హాస్యాన్ని జోడించి పాస్ మార్కుల‌తో బ‌య‌ట‌ప‌డేసేవాడేమో అనిపిస్తుంది. పాపం న‌రేష్‌కు తండ్రి లేని లోటు ఇప్ప‌టికీ ఇలా కొన‌సాగుతుండ‌టం విచార‌క‌రం.