గత ఏడాది చివర్లో హిందీ చిత్రం ‘దురంధర్’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది మార్చిలో వచ్చిన ‘దురంధర్-2’ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ల జాబితాలో ఈ రెండూ చోటు సంపాదించాయి. గత దశాబ్ద కాలంలో సౌత్ ఇండియన్ సినిమాల జోరు ముందు హిందీ చిత్రాలు వెనుకబడిపోగా.. ఇప్పుడు తమ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా వచ్చినందుకు బాలీవుడ్ ఎంతో గర్వించాలి.
కానీ ఆ సినిమాలను బాలీవుడ్ జనాలు ఓన్ చేసుకోలేదు. హృతిక్ రోషన్ లాంటి ఒకరిద్దరు తప్పితే ఆ సినిమాను కొనియాడుతూ సోషల్ మీడియా పోస్టులు పెట్టింది లేదు. హృతిక్ సైతం తన పోస్టులో ఇందులోని రాజకీయాల గురించి సన్నాయి నొక్కులు నొక్కాడు. ఐతే ‘దురంధర్’లో అయినా రాజకీయ అంశాలు ఉన్నాయి కాబట్టి, దాని మీద ప్రో మోడీ సర్కార్ ఫిలిం అనే ముద్ర పడింది కాబట్టి బాలీవుడ్ జనాలు ఓన్ చేసుకోలేదని అనుకోవచ్చు.
కానీ ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ నుంచి ‘రామాయణం’ లాంటి ఎపిక్ మూవీ వచ్చింది. ‘ఆదిపురుష్’లో దొర్లిన తప్పులను పునరావృతం కానివ్వకుండా.. విజువల్ ఎఫెక్ట్స్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటూ ‘రామాయణం’ను వరల్డ్ క్లాస్ సినిమాగా తీర్చిదిద్దింది చిత్ర బృందం.
రిలీజ్ ముంగిట సినిమాపై కొంత నెగెటివిటీ ఉన్నప్పటికీ.. విడుదల తర్వాత అదంతా పక్కకు వెళ్లిపోయింది. సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. పెద్ద రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో భాగమైన వాళ్లలో మెజారిటీ బాలీవుడ్ వాళ్లే. తమ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి చిత్రం వచ్చినందుకు బాలీవుడ్ కచ్చితంగా ప్రౌడ్ ఫీలవ్వాలి.
కానీ ‘రామాయణం’ను కొనియాడుతూ హిందీ ఇండస్ట్రీ బిగ్ షాట్స్ ఎవ్వరూ ఒక్క ట్వీట్ వేసింది లేదు. రాజమౌళి, మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగ లాంటి తెలుగు సినీ ప్రముఖులు ఏ భేషజం లేకుండా ‘రామాయణం’ను కొనియాడుతుంటే.. సొంత ఇండస్ట్రీ వాళ్లు ఈ ఎపిక్‌ను ఓన్ చేసుకోకపోవడం విడ్డూరం. బాలీవుడ్ అంటే యాంటీ బీజేపీ, యాంటీ హిందూ అనడానికి ఇది నిదర్శనమని.. అప్పుడు ‘దురంధర్’ను పట్టించుకోలేదన్నా.. ఇప్పుడు ‘రామాయణం’ను ఓన్ చేసుకోలేదన్నా అదే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates