ప్ర‌భాస్-నాగ్ అశ్విన్ టైటిల్ చెప్పేయ‌నున్నారా?


‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ కన్ఫమ్ చేసిన తొలి సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయాల్సినదే. కానీ మధ్యలోకి ‘ఆదిపురుష్’, ‘సలార్’ వచ్చేశాయి. ప్రభాస్ ఆ రెండు చిత్రాలనే ముందు పూర్తి చేయడానికి నిశ్చయించుకున్నాడు. అన్నింట్లోకి చివరగా అనౌన్స్ అయిన ‘సలార్’ ముందు సెట్స్ మీదికి వెళ్లనుండగా.. ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమా చివరికి వెళ్లిపోయింది. అది ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు.

‘మహానటి’ తీశాక 20 నెలలు మరో సినిమా చేయని నాగ్ అశ్విన్.. ఇంకో ఏడాదికి పైగానే ఎదురు చూడక తప్పేలా లేదు. ఐతే ప్రభాస్‌తో తాను చేయనున్న సినిమా విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లిపోకుండా సోషల్ మీడియాలో తరచుగా ఏదో ఒక ముచ్చట చెబుతూనే ఉన్నాడు నాగి. తాజాగా ఓ అభిమాని కామెంట్‌కు అతను స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇంతకుముందు నెటిజన్లతో సంభాషణ సందర్భంగా ఈ సంక్రాంతికి ప్రభాస్‌తో తాను చేయబోయే సినిమా అప్‌డేట్ ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఐతే పండుగ వచ్చింది వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని వెటకారంగా స్పందించాడు. సంక్రాంతికి అప్‌డేట్ అన్నావ్ ఏమైంది అని అడిగాడు. మరో అభిమాని వచ్చే ఏడాది సంక్రాంతి అనుకుంటా అని కామెంట్ చేశాడు. దీనిపై అశ్విన్ స్పందించాడు.

‘‘సరిగ్గా చెప్పాలంటే జనవరి 29, ఫిబ్రవరి 26’’ అని ట్వీట్ చేశాడు. దీంతో ఆ రెండు రోజుల్లో ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా గురించి ఇవ్వబోయే అప్ డేట్లు ఏంటి అన్న చర్చ అందరిలోనూ మొదలైంది. ముందు టైటిల్ ప్రకటించి.. ఆ తర్వాత ఫస్ట్ లుక్ లాంటిదేమైనా రిలీజ్ చేస్తారా అని చూస్తున్నారు అభిమానులు. నాగ్ అశ్విన్ మావయ్య అశ్వినీదత్ ‘వైజయంతీ మూవీస్’ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదొక సైంటిఫిక్ టచ్ ఉన్న ఫాంటసీ థ్రిల్లర్ అంటున్నారు.