భామలు చల్లే బురదకు బాధ్యులు ఎవరు

ఇటీవలే విడుదలైన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్లలో భాగంగా రాధికా ఆప్టే గతంలో తాను పని చేసిన తెలుగు సినిమా గురించి చేసిన అసంబద్ధ కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. వయసులో బాగా పెద్దయిన హీరోతో పెళ్లి కుదరడం లాంటివి ఉదాహరణగా చెబుతూ కొన్ని వ్యంగ్యాస్త్రాలు వేసింది. ఇటీవలే కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో జాన్వీ కపూర్ సైతం పెద్ది గురించి డైరెక్ట్ గా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడికేదో తాను ఇంత వరకు గ్లామర్ పాత్రలే వేయలేదనే తరహాలో సింపతీ నటించింది.

ఇప్పుడే కాదు గతంలో తాప్సీ పన్ను ఏకంగా తొలి అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారి మీదే సెటైర్ పేరుతో అవాకులు పేలింది. తర్వాత సారీ చెప్పినప్పటికీ ఏరు దాటాక తెప్పతగలేసిన తీరు గురించి నెటిజెన్లు తీవ్రంగా విమర్శించారు. ఇలా టాలీవుడ్ మీద ఉత్తరాది భామలు బురద జల్లుతుంటే దానికి బాధ్యులు ఎవరంటే ముమ్మాటికీ మన దర్శక నిర్మాతలే. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు ఇచ్చి, వాళ్లకు సకల మర్యాదలు చేసి, గొప్ప ట్రీట్ మెంట్ అందిస్తే చివరికి వాళ్ళు చూపిస్తున్న బుద్ది ఇంత తక్కువ స్థాయిలో ఉంది.

పైన చెప్పిన ముగ్గురికే కాదు ఏ హీరోయిన్ కైనా వర్తించే సూత్రం ఒకటుంది. ఎవరూ ఎవరిని ఫలానా సినిమాలో నటించమని బలవంత పెట్టరు. కథ నచ్చలేదు, మీరు చెప్పింది బాలేదని నో చెప్పే హక్కు ప్రతి ఒక్కరి సొంతం. పారితోషికం తీసుకుని, పాత్ర ఎలా ఉంటుందో ముందే తెలిసి కూడా ఇప్పుడు తాపీగా మాకేదో అన్యాయం జరిగిపోయిందనే తరహాలో శోకాలు పెట్టడం మరీ కామెడీగా ఉంది. హిందీ చిత్రాల్లో బోల్డ్ గా నటించిన రాధిక ఆప్టే, లిప్ లాక్ కిస్సులకు నో చెప్పని జాన్వీ, మొగుళ్లను హత్యలు చేసే పాత్రలు పోషించిన తాప్సి ఇలా నీతి సూత్రాలు వల్లెవేయడం కామెడీ కాక మరేమిటి.

ఇదంతా మీడియాలో హైలైట్ అవ్వడానికి పడుతున్న తాపత్రయం తప్ప మరొకటి కాదు. తెలుగు సినిమాల్లో తప్ప తాము అసలు గ్లామర్ షోనే చేయలేదు, పచ్చిగా అనిపించే క్యారెక్టర్లలోనే నటించలేదనే తరహాలో వేస్తున్న జోకులు ఎబ్బెట్టుగా ఉన్నాయి. సైలెంట్ గా ఉంటే ఏ గొడవా ఉండేది కాదు. కళ్ళముందు సాక్ష్యాలను పెట్టుకుని ఇలా అమాయకంగా మాట్లాడ్డం చూస్తే కోరిమరీ తెచ్చుకున్న మనదే తప్పనిపిస్తోంది. వీళ్ళు ఇలా చేస్తారని ముందే గుర్తించే ఛాన్స్ లేదు కాబట్టి అంతా అయిపోయాకే అసలు రంగులు బయట పడతాయి.