నేను ఒక్క సిగ్నల్ ఇస్తే… బిగ్-బి వార్నింగ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ చాలా ప్రశాంతచిత్తంతో కనిపించే వ్యక్తి. పబ్లిక్ ఫాట్ ఫామ్స్‌లో ఆయనకు ఆగ్రహం రావడం అరుదు. కానీ తాజాగా ఒక మీడియా సంస్థ ఆయనకు తీవ్రంగానే కోపం తెప్పించింది. ఆయన ఏ స్థాయిలో ఆగ్రహించారు అంటే.. నేను గనుక ఒక సిగ్నల్ ఇచ్చారంటే నా ఫాలోవర్లు మిమ్మల్నేం చేస్తారో అన్నట్లుగా ఒక ట్వీట్ వేసేంత. ఇంతకీ ఏం జరిగిందంటే..?

అమితాబ్ కొన్ని రోజుల ముందు ‘హోథీ ఘోడా పల్కీ.. జై కన్హయ్య లాల్ కీ’ అంటూ సాగే శ్రీ కృష్ణుడి కీర్తనను ట్వీట్ చేశాడు. దాని గురించి న్యూస్ 18 మీడియా సంస్థ ప్రచురిస్తూ.. అమితాబ్ తన ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారని.. మీరు ఏనుగులు, గుర్రాలు తెచ్చుకోండి.. మేం మా ఆయుధాలతో పోరాడతామని హెచ్చరించారని పేర్కొంది. ఇది అమితాబ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. శ్రీకృష్ణుడి వ్యాఖ్యలను వక్రీకరించడమే కాక.. తన ట్వీట్‌ను ప్రత్యర్థులకు హెచ్చరిక అన్నట్లు చిత్రించారని అమితాబ్ మండిపడ్డారు.

తనకు సోషల్ మీడియాలో 5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారని గుర్తు చేసిన అమితాబ్, తాను ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే అందులో పది శాతం మంది మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధమవుతారని.. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తే వాళ్లు 100 రెట్లు ఎక్కువగా ప్రతిస్పందిస్తారని అమితాబ్ హెచ్చరించారు. శాంత స్వభావిలా ఉంటూ, సోషల్ మీడియాలో ఎప్పుడూ మంచి విషయాలే చెప్పే అమితాబ్‌కు ఇంత కోపం రావడం.. ఇలా వార్నింగ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

84 ఏళ్ల వయసులోనూ అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడమే కాదు.. చురుగ్గా కౌన్ బనేగా కరోడ్ పతి షో చేస్తున్నారు. మరోవైపు కల్కి 2 షూటింగులో కూడా పాల్గొంటున్నారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా నివాసం ముందు అభిమానులను కూడా కలుసుకున్నారు అమితాబ్. ఐతే ఇటీవల టైగర్ ష్రాఫ్ మీద దాడి నేపథ్యంలో చక్రాలు అమర్చిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ డోర్స్ ఉన్న వాహనంలో ఆయన అభిమానులకు దర్శనమివ్వడం చర్చనీయాంశం అయింది. అమితాబ్ ఇటీవల సినిమాలు బాగా తగ్గించేశారు.