రెండేళ్ల కిందట ‘కేజీఎఫ్’ అనే సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుంటే.. కన్నడ సినిమాలు ఇక్కడేం వర్కవుట్ అవుతాయి అన్న వాళ్లే ఎక్కువ. ఎందుకంటే అప్పటిదాకా ఉపేంద్ర సినిమాలు కొన్ని తప్ప ఇక్కడ కన్నడ చిత్రాలు పెద్దగా ఆడింది లేదు. ‘కేజీఎఫ్’ ట్రైలర్లో స్టన్నింగ్స్ విజువల్స్ కారణంగా సినిమాపై కొంత ఆసక్తి కనిపించింది కానీ.. బాక్సాఫీస్ దగ్గర అది ఏమాత్రం ప్రభావం చూపుతుందన్న సందేహాలు కనిపించాయి. కానీ ఆ చిత్రం ఇక్కడ అద్భుతాలు చేసింది.
2018 క్రిస్మస్‌కు వచ్చిన వేరే తెలుగు సినిమాలను దెబ్బ కొట్టి మరీ అది బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి జాక్ పాట్ కొట్టారు. రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే రూ.12 కోట్లకు పైగా లాభాలు అందుకున్నారు. ఐతే ఇప్పుడు ‘కేజీఎఫ్’ చాప్టర్-2కు ఉన్న క్రేజ్ చూస్తే తొలి భాగం కంటే ఐదారు రెట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్-2’ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఐతే పెద్దగా అంచనాల్లేని సమయంలో చాప్టర్-1ను చక్కగా ప్రమోట్ చేసి మంచి థియేటర్లు కేటాయించి పెద్ద ఎత్తున రిలీజ్ చేసిన సాయి కొర్రపాటి మీద నమ్మకంతో చాప్టర్-2ను కూడా ఆయనకే ఇస్తోందట హోంబలె ఫిలిమ్స్. ఐతే హక్కుల కోసం ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సాయికి కూడా భారీ రేటునే కోట్ చేశారట. టీజర్ రాకముందు వరకు కేజీఎఫ్-2 తెలుగు రైట్స్ డీల్ రూ.50 కోట్లకు తెగొచ్చని అనుకున్నారు కానీ.. టీజర్ రిలీజయ్యాక అంచనాలు ఇంకా పెరిగిపోవడంతో రేటు రూ.60 కోట్లకు పెరిగినట్లు సమాచారం.
కేజీఎఫ్-2కు పాన్ ఇండియా లెవెల్లో బంపర్ క్రేజ్ ఉంది. దానికి పోటీగా ఏ భాషలోనూ వేరే చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి వేసవిలో, థియేటర్లలో 100 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉన్న టైంలో రిలీజ్ చేస్తే ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. తెలుగులో రూ.60 కోట్ల షేర్ సాధించడం కష్టమేమీ కాకపోవచ్చు.