మౌళిని కమర్షియల్ వింగ్‌లోకి లాగుతున్నారా

గత ఏడాది లిటిల్ హార్ట్స్ తో పరిచయమైన మౌళికి అంతకు ముందే సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ ఇమేజ్ తన డెబ్యూ విజయడానికి చాలా తోడ్పడింది. కంటెంట్ కూడా దానికి తగ్గట్టే యూత్ ఫుల్ గా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాని బాగా చూశారు. ఈ క్రమంలోనే తనకు ఆఫర్లు రావడం, మైత్రి లాంటి పెద్ద సంస్థ దొంగ నా కొడుకు రూపంలో అవకాశం ఇవ్వడం జరిగిపోయాయి. నవంబర్ 13 విడుదలకు ఇది రెడీ అయిపోయింది.

ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి ఒక టీజర్, పాట బయటికి వచ్చాయి. వాటిలో మౌళితో బాగా స్టెప్పులు వేయించారు. కథలో భాగంగా హీరోయిన్ వెంట పడే సాంగే అయినా కమర్షియల్ టచ్ ఇచ్చిన వైనం స్పష్టంగా కనిపించింది. ప్రెస్ మీట్ లో చెప్పిన స్టోరీ పాయింట్ కూడా కొంచెం అదే ఫ్లేవర్ లో కనిపిస్తోంది. దొంగ బుద్దులు ఉన్న ఒక కుర్రాడు అనుకోకుండా నిజమైన క్రైమ్ లో ఇరుక్కోవడం, దాన్నుంచి బయటికి రావడం, చులకన భావమున్న తండ్రికి కనువిప్పు కలిగించడం లాంటివి ఉన్నాయి.

సోషల్ మీడియాలో దీని పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మౌళి ఇంకా ప్రారంభంలోనే ఉన్నాడని, అప్పుడే మాస్ చక్రంలో దించకుండా సాఫ్ట్ జానర్ లో రామ్ కామ్స్ చేయాలని కోరుతున్న వాళ్ళు ఎక్కువే కనిపిస్తున్నారు. ఇది ఒకరకంగా నిజమే. చిన్న వయసులో ఉన్న మౌళి ఇంకా నటన పరంగా మెరుగు పడాల్సింది, రుజువు చేసుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడే ఫైట్లు పాటలు అంటూ పరిమితులు పెట్టుకుంటే తర్వాత మార్కెట్ పరంగా ఇబ్బందవుతుంది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మౌళి స్పీడ్ పెంచాలి. ఇంకా ఓనమాలు దిద్దే స్టేజిలో ఉన్నా ఏడాదికి ఒక సినిమా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రెమ్యునరేషన్లు ఎక్కువగా వచ్చి ఉండొచ్చు అంతమాత్రాన నెమ్మదించాల్సిన అవసరం లేదు. నాని రవితేజ లాంటి వాళ్ళు కెరీర్ ప్రారంభంలో ఏడాదికి అయిదారు సినిమాలు చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మౌళి వాళ్ళ స్టేజికి చేరుకోవాలంటే వేగం అవసరం. ఇప్పటినుంచి ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బెటర్.