తాగి పాట పాడిన లెజెండ‌రీ సింగ‌ర్?

ద‌లేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగ‌ర్. తుణుక్ తుణుక్ తున్.. స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌తో ఆయ‌న దేశ‌వ్యాప్తంగా సంగీత ప్రియుల‌ను ఉర్రూత‌లూగించాడు. తెలుగులో కూడా ర‌బ్బ‌రు గాజులు ర‌బ్బ‌రు గాజులు (య‌మ‌దొంగ‌) స‌హా కొన్ని పాట‌లు పాడారాయ‌న‌. ఈ మ‌ధ్య ఆయ‌న ఊపు కొంచెం త‌గ్గింది. సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గాయి.

అయిన‌ప్ప‌టికీ ప్రైవేటు షోల‌లో పాడుకుంటూ త‌న ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ఇలాంటి దిగ్గ‌జ గాయ‌కుడికి తాజాగా చేదు అనుభ‌వం ఎదురైంది. మ‌ద్యం తాగి పెర్ఫామెన్స్ ఇస్తున్నాడంటూ ద‌లేర్ మీద స్థానిక ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న పెర్ఫామెన్స్ ఆపించి స్టేజ్ మీది నుంచి కిందికి దించేశారు. ఈ ఉదంతం ఉత్త‌రాఖండ్‌లోని న‌రేంద్ర‌న‌గ‌ర్‌లో జ‌రిగింది.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో పెర్ఫామెన్స్ కోసం దలేర్ మెహందీ వెళ్లారు. అయితే.. ఆయ‌న వేదిక ఎక్కి పాటలు పాడుతుండగా ఈ వేడుక‌ల‌కు అతిథిగా వ‌చ్చిన ఎమ్మెల్యే శుభోద్ ఉనియ‌ల్ అడ్డు త‌గిలారు. నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో తాగి పాడుతావా అంటూ ద‌లేర్ మీద ఆయ‌న‌ మండిప‌డ్డారు.
దలేర్ స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఎమ్మెల్యే విన‌లేదు.

సరిగ్గా మాట్లాడలేకపోతున్నావ్, ఇక పాటలు ఏం పాడుతావ్.. అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌క్క‌నున్న వ్య‌క్తులు ఎమ్మెల్యేను వారించే ప్ర‌య‌త్నం చేసినా.. ఆయ‌న కోపాన్ని ఆపుకోలేక‌పోయారు. దలేర్ ఎమ్మెల్యేను ప్ర‌తిఘ‌టించ‌క‌పోవ‌డం.. ఆయ‌న హావ‌భావాలు చూస్తే కొంచెం తేడాగానే అనిపించాయి. ఆయ‌న మ‌ద్యం తాగి వ‌చ్చింది నిజ‌మే అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.