పేట దర్శకుడికి ఛాన్సివ్వాలి బాసు

తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని చాలామంది చెప్పే మాటల్లో అతిశయోక్తి ఏమీ ఉండదు. ఐతే చిరుతో సినిమా చేయాలని ఇతర భాషల దర్శకులు కూడా ఆశపడతారనడానికి తాజా ఉదాహరణ కార్తీక్ సుబ్బరాజ్. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ‘పేట’ సినిమాలో తనదైన శైలిలో ప్రెజెంట్ చేసి అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాడు కార్తీక్.

ఇటీవలే ‘డోరతీ’ అనే సెన్సేషనల్ మూవీతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు కార్తీక్. ఆ సినిమా మీద ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా సరే.. మెజారిటీ ప్రేక్షకులు దాన్ని మెచ్చారు. సినిమా క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేసే కార్తీక్ తన కొత్త చిత్రాన్ని మెగాస్టార్‌తో చేయాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల ముందు వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు నిజమే అని తేలిపోయింది. ఒక తెలుగు పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజ్.. తాను చిరంజీవికి కథ చెప్పిన విషయం వాస్తవమే అని చెప్పాడు. కానీ దీనిపై చిరు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నాడు. ఈ వార్త కార్తీక్‌ను అభిమానించే తెలుగు ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది. అలాగే చిరు నుంచి వైవిధ్యం కోరుకునే అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెంచుతోంది. ఇమేజ్ గురించి, బాక్సాఫీస్ ఫలితం గురించి ఏమీ ఆలోచించకుండా కార్తీక్‌తో చిరు జట్టు కట్టాలనే డిమాండ్లు అభిమానుల నుంచే వినిపిస్తున్నాయి.

చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా వరకు రొటీన్ సినిమాలే చేస్తుండడం పట్ల అభిమానుల్లోనూ ఒక వర్గంలో అసంతృప్తి ఉంది. ప్రయోగాలు చేయడానికి, తనలోని గొప్ప నటుడిని సంతృప్తి పరిచే సినిమాలు చేడయానికి ఇది మంచి తరుణం అని ఈ వర్గం అభిప్రాయపడుతోంది. శ్రీకాంత్ ఓదెల సినిమా దాదాపుగా క్యాన్సిల్ అయినట్లే కనిపిస్తున్న నేపథ్యంలో అతడి స్థానంలో కార్తీక్‌కు చిరు ఛాన్సివ్వాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.