స్పిరిట్ అప్‌డేట్… ఇంకో ఏడాది ఆగాలి

ప్రభాస్ అభిమానులు అనుకున్నంతా అయ్యింది. మార్చిలో విడుదల కావాల్సిన స్పిరిట్ వాయిదా పడి ఏకంగా అక్టోబర్ 29 తేదీకి వెళ్ళిపోయింది. ఈ మేరకు కొత్త పోస్టర్ ని విడుదల చేసింది టీమ్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీని గురించి ముందే హింట్ ఇచ్చి ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేయడం గమనార్హం. గత కొద్దిరోజులుగా ఫౌజీ గురించి వార్తలు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు స్పిరిట్ తనకు తానుగా పోస్ట్ పోన్ ని అఫీషియల్ గా చెప్పడం మంచి పరిణామం. ఒక టెన్షన్ తీరిపోయింది.

ఈ లెక్కన ఫౌజీ మార్చి లేదా ఏప్రిల్ లో రావడం పక్కాని అర్థమైపోయింది. వారణాసి గురించి కూడా ఏవేవో గాసిప్స్ నిన్నటి నుంచి ప్రచారంలోకి వస్తున్నాయి. రాజమౌళి ఈసారి కూడా వాయిదా తీసుకుంటారని తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే టీమ్ అసలా ఉద్దేశంలోనే లేదని, ప్రమోషనల్ ప్లాన్ కూడా సిద్ధమైపోయిందని, ఫస్ట్ కాపీ వచ్చేవరకు జక్కన్న ఇలాంటివి ఏవీ పట్టించుకోరని సన్నిహితులు అంటున్నారు. ఒకవేళ నిజమైతే మటుకు అదో కొత్త సమస్యవుతుంది.

ఇక స్పిరిట్ విషయానికి వస్తే క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ కోసం మూవీ లవర్స్ ఇంకో ఏడాది దాకా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇది పెద్ద గ్యాప్ అయినప్పటికీ వేరే ఆప్షన్ లేదు. ఇంకా చెప్పుకోదగ్గ మోతాదులోనే షూటింగ్ బ్యాలన్స్ ఉందట. పైగా రాజమౌళి, సుకుమార్ లాగే వంగ రాజీపడే రకం కాదు. క్వాలిటీ కోసం ఎంత ఆలస్యమైనా, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. క్రైమ్ నేపధ్యంలో రూపొందుతున్న స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

రాబోయే రోజుల్లో ఇలాంటి రిలీజ్ డేట్ల మార్పు వార్తలు చాలానే చూడాల్సి వస్తుంది. ఫౌజీ, స్పిరిట్ మాత్రమే కాదు వారణాసి, డ్రాగన్, విశ్వంభర, రాకా లాంటివి కూడా ఖచ్చితంగా మాట మీద ఉంటాయో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బడ్జెట్లు, మేకింగ్ లో ఆలస్యాలు, విఎఫ్ఎక్స్ పనులు ఇలా సవాలక్ష కారణాలు వాయిదాలకు దారి తీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 2027లో ఎప్పుడూ చూడనన్ని ఛేంజెస్ అయితే ఉండబోతున్నాయి. అలాంటి మార్పులకు, షాకులకు ముందే సన్నద్ధం కావడం అవసరం.