కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు నెంబర్లు చెబుతున్నాయి. ఇవాళ గంటకు కేవలం వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోవడం కొంచెం ఇబ్బంది కలిగించే పరిణామమే. నిర్మాణ సంస్థ ప్రకటించిన దాని ప్రకారం నిన్నటితోనే ఇరవై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటేసినట్టే. ఇకపై వచ్చే వసూళ్లు లాభాల్లో లెక్కేసుకోవచ్చని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇక్కడ సానుకూలంగా పని చేసిన విషయం ఒకటుంది. శ్రీవిష్ణు సినిమాలు రీజనబుల్ గా బిజినెస్ చేసుకుంటాయి. అత్యాశకు వెళ్ళిపోయి ఎక్కువ రేట్లకు అమ్మడం లాంటివి నిర్మాతలు చేయరు. బడ్జెట్లు కూడా పరిమితంగానే ఉంటాయి. కామ్రేడ్ కళ్యాణ్ ఈ స్ట్రాటజీని బాగా వాడుకుంది. తన నప్పని జానర్ లో మృత్యుంజయ్ చేసి ఫ్లాప్ చూసిన శ్రీవిష్ణు తిరిగి తన ఫన్ మోడ్ లోకి రావడం మంచి పరిణామం. ఆ నమ్మకమే టాక్ తో సంబంధం లేకుండా వారాంతం కలెక్షన్లను తీసుకొచ్చింది.

అయితే ఒక్క మాట గుర్తుంచుకోవాలి. శ్రీవిష్ణు ఇకపై మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్ ల విషయంలో వ్యవహరించాలి. సామజవరగమనకు చూసిన ఆప్లాజ్ మళ్ళీ తన ఇంకో సినిమాకు రాలేదు. ఆ రేంజ్ టాక్ వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీవిష్ణు ఈజీగా ముప్పై నలభై కోట్ల మార్కుని దాటేయొచ్చు. కానీ కామ్రేడ్ కళ్యాణ్ లాంటివి ఆ ఫీట్ చేయడానికి సరిపోవు. నవ్వించడం వరకు ఓకే కానీ కాన్సెప్ట్, స్టోరీ పరంగా ఈ మూవీ గురించి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన నిజాన్ని దాచలేం.

ఇక ఈ వారంలో వరసగా దసరా రిలీజులున్నాయి. జైలర్ 2, రణబాలి, క్రేజీ కళ్యాణం, గరివిడి లక్ష్మి ఇలా వరసగా క్యూ కట్టేయడంతో కామ్రేడ్ కళ్యాణ్ ఇంత పోటీలో రెండో వారం పికప్ చూపించడం అంత ఈజీ కాదు. కాకపోతే పండగ సెలవులు ఉన్నాయి కాబట్టి ఉన్నంతలో యూత్, పిల్లలను లాగే ఛాన్స్ ఉంటుంది. కొత్త రిలీజుల టాక్ ఎలా ఉందనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. శ్రీవిష్ణు తర్వాతి సినిమా ఫ్యామిలీ ప్యాక్ 2027 సంక్రాంతి విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.