కూతురిని స్టేజ్ మీదికి రానివ్వ‌ని రేణు దేశాయ్

సీనియ‌ర్ న‌టి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా రోజుల త‌ర్వాత ఒక సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. ఆ చిత్ర‌మే.. ధ‌నుష్ హీరోగా న‌టించిన‌ ఓం. ఇందులో రేణు ఒక కీల‌క పాత్ర చేశారు. ఆమెది మ‌మ్ముట్టి భార్య పాత్ర‌గా భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్ సోమ‌వారం హైద‌ర‌బాద్‌లో జ‌ర‌గ్గా.. ఇందులో రేణు కూడా పాల్గొన్నారు.
ఆమె స్టేజ్ మీదికి వ‌చ్చి మాట్లాడ‌బోతున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

యాంక‌ర్.. కింద కూర్చుని ఉన్న రేణు, ప‌వ‌న్‌ల కూతురు ఆద్య‌ను స్టేజ్ మీదికి పిలుద్దామ‌ని అంది. ఆ విష‌యాన్ని మైక్‌లో అనౌన్స్ చేసింది కూడా. కానీ రేణు ఇందుకు అంగీక‌రించ‌లేదు. ఆద్య స్టేజ్ మీదికి రావాల్సిన అవ‌స‌రం లేదంటూ ఆపేసింది. కింద కూర్చున్న ఆద్య కూడా నేనెందుకు స్టేజ్ మీదికి అన్న‌ట్లు త‌ల అడ్డంగా ఊపింది.

ప‌వ‌న్, రేణుల కూతురు పెద్ద అమ్మాయి అయి, ఇలా ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన‌డంతో అంద‌రి దృష్టీ త‌న మీద ప‌డింది. న‌టిగా త‌న త‌ల్లి కెరీర్‌కు ఓం కీల‌క‌మైన సినిమాగా భావిస్తున్న నేప‌థ్యంలోనే ఆద్య ఈ ఈవెంట్‌కు వ‌చ్చిన‌ట్లుంది. ఈ సినిమా త‌ర్వాత రేణుకు సౌత్ సినిమాలో న‌టిగా అవ‌కాశాలు పెర‌గొచ్చ‌ని భావిస్తున్నారు. ఆమె త‌న సొంత భాష‌ మ‌రాఠీలో సినిమా డైరెక్ట్ చేయ‌డంతో పాటు ప్రొడ్యూస్ చేసింది.

‘ఓం’ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ నడిచే కథ. 2015లో 21 మంది తమిళ కూలీలను ఏపీ పోలీసులు చంపిన ఉదంతం చుట్టూ ఈ కథ సాగుతుందని.. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ విషయంలో వివాదాలు రేకెత్తడం ఖాయమని అంటున్నారు. అమ‌రన్ త‌ర్వాత రాజ్ కుమార్ పెరియ‌స్వామి రూపొందించిన సినిమా కావ‌డం.. ధ‌నుష్ కెరీర్లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ ఈ సినిమాపై పెట్ట‌డంతో దీనిపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి, శ్రీలీల కీల‌క పాత్ర‌లు పోషించారు.