నెల్సన్ తొలి సినిమా ఉన్న లాప్ ట్యాప్ ఎవడో లేపేసాడు

నెల్సన్ దిలీప్ కుమార్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో అతను తీసిన ‘జైలర్’, ‘జైలర్-2’ చిత్రాలు రెండూ తమిళంలో ఇండస్ట్రీ హిట్లయ్యాయి. నయనతారతో అతను తీసిన తొలి చిత్రం ‘కోలమావు కోకిల’ బ్లాక్ బస్టర్ కాగా.. ఆ తర్వాత శివకార్తికేయన్‌తో రూపొందించిన ‘డాక్టర్’ ఇంకా పెద్ద విజయాన్ని సాధించింది. మధ్యలో విజయ్‌తో తీసిన ‘బీస్ట్’ ఒక్కటి మాత్రమే నిరాశపరిచింది. 

ఐదు సినిమాల్లో నాలుగు భారీ విజయాలతో నెల్సన్ తనేంటో చాటి చెప్పాడు. ఇక అతను రజినీకాంత్, కమల్ హాసన్‌ల క్రేజీ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం దక్షిణాదిన అత్యధిక పారితోషకం అందుకుంటున్న దర్శకుల్లో అతను ఒకడు. నెల్సన్‌తో సినిమా చేయడానికి టాప్ స్టార్లు అమితాసక్తితో ఉన్నారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న నెల్సన్ దర్శకుడిగా తన తొలి చిత్రం కోసం మామూలు కష్టాలు పడలేదట. 

ఈ విషయాన్ని అతడికి సన్నిహితుడైన ‘అమరన్’ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నెల్సన్ ఫస్ట్ మూవీ ‘కోలమావు కోకిల’ 2018లో విడుదలైన సంగతి తెలిసిందే. కానీ దానికి 9 ఏళ్ల ముందే అతను తన తొలి చిత్రాన్ని మొదలుపెట్టాడట. అది వేరే కథతో తెరకెక్కిన సినిమా అని, అందులో పేరున్న ఆర్టిస్టులు నటించారని రాజ్‌కుమార్ వెల్లడించాడు.

ఐతే కొన్ని కారణాల వల్ల షూటింగ్ బాగా ఆలస్యం అయిందని, ఎంతకీ అది పూర్తి కాలేదని అతను చెప్పాడు. ఇంకో పది రోజులు షూట్ చేస్తే సినిమా పూర్తయ్యే దశలో ఏళ్ల తరబడి ఆ సినిమా ఫినిష్ కాకుండా ఉండిపోయిందని రాజ్ కుమార్ తెలిపాడు. ఆ సినిమాకు నెల్సన్ ఒక క్రేజీ టీజర్ కూడా కట్ చేశాడని, దానికి తాను డబ్బింగ్ కూడా చెప్పానని అతను వెల్లడించాడు. 

ఐతే సినిమా చివరి దశలో ఉండగా.. రష్ అంతా ఒక ల్యాప్‌టాప్‌లోకి నెల్సన్ ఎక్కించాడని.. అతను ట్రాఫిక్‌లో ఒక చోట కారు ఆపగా ఎవరో ఆ ల్యాప్ టాప్ కొట్టేశారని, అలా ఆ సినిమా కంటెంట్ అంతా పోగొట్టుకున్నాడని, అలా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకే రాలేదని రాజ్‌కుమార్ తెలిపాడు. ఆ హార్ట్ బ్రేక్ తర్వాత మళ్లీ నెల్సన్ ప్రయత్నాలు చేసి, ‘కోలమావు కోకిల’ చేశాడని.. 2009లో దర్శకుడిగా తొలి చిత్రాన్ని మొదలుపెడితే, 2019లో తన డెబ్యూ మూవీ విడుదలైందని.. ఈ మధ్యలో అతను మామూలు కష్టాలు పడలేదని రాజ్‌కుమార్ చెప్పుకొచ్చాడు.