సినిమా థియేటర్లకు ఇది పెద్ద దెబ్బ!

లాక్ డౌన్ నెమ్మదిగా ఎత్తేస్తున్న వేళ, సినిమా థియేటర్లు కూడా తెరిచేస్తారని ఆశ చిగురించింది. లిక్కర్ షాప్స్ కి పర్మిషన్ వచ్చింది కనుక ఒక నెల రోజుల్లో సినిమా హాళ్లు కూడా తెరిచేస్తారని భావించారు. అయితే లిక్కర్ షాప్స్ వద్ద సామాజిక దూరం గంగలో కలిసి… పోలీసులు కూడా చేతులు ఎత్తేయడంతో జనం గుమికూడే వ్యాపారాలకు పర్మిషన్ ఇవ్వడం ఎంత తప్పో గవర్నమెంట్ కి తెలిసి వచ్చింది.

జనాల్లో అసలు కరోనా భయం లేదని, తమ వ్యసనం, తమ విలాసం తప్ప తనకీ, తన కుటుంబ సభ్యులకి ఏమవుతుందో అనే ఆలోచన అసలు లేదని మద్యం షాపుల వద్ద సన్నివేశాలే చూపించాయి. ఇలాంటి సమయంలో సినిమా థియేటర్లు తెరిస్తే ఇంత కంటే ఇదిగా ఎగబడిపోతారని, గవర్నమెంట్ లాక్ డౌన్ ఎట్టేసిందంటే కరోనా వెళ్ళిపోయింది అనుకుంటారని ఇప్పుడు స్పష్టంగా తెలిసింది.

అసలే సినిమా హాళ్ళని ఆఖరులో తెరవాలని ముందే డిసైడ్ అయిపోగా బాధ్యత లేని జనం తీరు చూసాక కరోనా బూచి పూర్తిగా వదిలిపోతే తప్ప పర్మిషన్ ఇవ్వరని అనిపిస్తోంది. రేపు థియేటర్లు తెరిచినా వెంటనే సినిమాలకు వస్తారా రారా అనే నిర్మాతల భయాన్ని అయితే లిక్కర్ షాపుల వద్ద క్యూ లైన్లు పోగొట్టేశాయి. ఎప్పుడు తెరిస్తే అప్పుడు సినిమా హాళ్లలో జాతరే అని నిర్మాతలకి ధైర్యం వచ్చేసింది.