రౌడీ ఫ్యాన్స్.. ఇవన్నీ అవసరమా?


ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే ఫ్లెక్సీ ప్రింట్ తీసి పూజలు చేయడం.. స్టిక్కర్లు తీసి బైకుల మీద అంటించడం.. టైటిల్‌తో టాటూలు వేయించుకోవడం.. టీజర్ రిలీజైతే సిస్టమ్ ముందు హారతులివ్వడం.. పనిగట్టుకుని టీజర్లు, ట్రైలర్లకు వ్యూస్, లైక్స్ కొట్టడం.. ఇలాంటి విచిత్ర పోకడలకు శ్రీకారం చుట్టిన ఘనత తమిళ అభిమానులకే చెందుతుంది. వాళ్ల నుంచి మన వాళ్లు కూడా ఈ ఒరవడిని బాగానే అందిపుచ్చుకున్నారు.

నిజంగా కొందరు మ్యాడ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఇలా చేస్తే ఏమోలే అనుకోవచ్చు. కానీ ఒక హీరో ఫాలోయింగ్ ఎంత అని తెలియజెప్పడానికి పీఆర్వోలు, అభిమాన సంఘాలు పని గట్టుకుని ఇలాంటివి చేయించడం.. దీని గురించి సోషల్ మీడియాలో డప్పు కొట్టడం బాగా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. పర్టికులర్‌గా పీఆర్వోల బ్యాకప్‌ బాగా ఉన్న కొందరు బడా హీరోల విషయంలోనే ఇలా జరగడాన్ని గమనించవచ్చు.

ఐతే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా ఎదిగి, మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇప్పుడిలా జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్న విజయ్ కొత్త సినిమా ‘లైగర్’ (లయన్+టైగర్) టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రౌడీ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిన్న చిన్న టౌన్లలో ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రింట్ తీసి హారతులివ్వడం.. మేళ తాళాలతో ఊరేగింపులు చేయడం.. ‘లైగర్’ పోస్టర్‌కు బీరాబిషేకం చేయడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. అంతే కాక కొందరు ఫ్యాన్స్ అయితే ‘లైగర్’ టైటిల్‌ను పర్మనెంట్ పచ్చబొట్లు పొడిపించుకోవడం గమనార్హం. దీని గురించి ‘లైగర్’ సమర్పకురాలు చార్మి సహా చిత్ర బృందంలోని వారు ఘనంగా ట్వీట్లు వేశారు.

అసలు ‘లైగర్’ టైటిల్ గురించి పాజిటివ్ రెస్పాన్స్ లేదు సోషల్ మీడియాలో. అలాంటి టైటిల్‌ను పచ్చబొట్లు వేసుకుంటుండటంతో రేప్పొద్దున టైటిల్ మారిస్తే, లేదా సినిమా తేడా కొడితే ఏంటి పరిస్థితి అంటూ మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు. బడా హీరోల ఫ్యాన్స్‌ను పీఆర్వోలు వెనకుండి నడిపిస్తూ ఇలాంటి ‘అతి’ చేష్టలు చేయించడం మామూలే కానీ.. విజయ్ అభిమానులకు ఇలాంటివన్నీ అవసరమా అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.