రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 6 థియేటర్లకు వస్తున్నట్టు మీడియాలో వస్తోంది కానీ నిర్మాతలు మాత్రం ప్రతి పోస్టర్ లో దీపావళి అంటున్నారు తప్పించి డేట్ అనౌన్స్ చేయడం లేదు. ఇప్పటిదాకా వచ్చిన టీజర్, ట్రైలర్, రామ రామ పాట ఈ మూడూ మిశ్రమ స్పందన దక్కించుకున్న నేపథ్యంలో హైప్ అమాంతం పెరగాలంటే అద్భుతం జరగాల్సిందే.

అసలు ఇంత అలసత్వంతో రామాయణ బృందం ఎందుకు ఉందనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. ప్రమోషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. రన్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ ఇలా ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నా సరే వాళ్ళెవరూ బయటికొచ్చి విశేషాలు పంచుకోవడం లేదు. ఇంకా టైం ఉందని నిర్మాణ సంస్థ అనుకోవచ్చు కానీ గ్రౌండ్ లెవెల్ లో హైప్ పెరగాలంటే క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తూ ఉండాలి.

ముందైతే యష్ అందుబాటులోకి రావాలి. టాక్సిక్ డిజాస్టర్ తర్వాత మళ్ళీ బయట కనిపించలేదు. మన బాధ్యత నిర్వర్తించాం, ఫలితం మన చేతుల్లో లేదని ఒక మీడియా ప్రతినిధితో అన్నట్టుగా వచ్చిన వార్త తప్ప ఆయన నుంచి నేరుగా ఎలాంటి సమాచారం లేదు. రామాయణలో యష్ కేవలం నటుడే కాదు నిర్మాణ భాగస్వామి కూడా. సో జనం లాగే తను కూడా టాక్సిక్ ని మర్చిపోయి వీలైనంత త్వరగా రామాయణ ప్రపంచంలోకి వచ్చేయడం అన్నింటికన్నా అవసరం.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్ బిజినెస్ ని వారం పది రోజుల్లో క్లోజ్ చేసేలా నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. ఏపీ తెలంగాణ హక్కులు దిల్ రాజు సొంతం కావొచ్చని వినికిడి. టాక్సిక్ కి ఫలితం దక్కని నేపథ్యంలో ఈ విధంగా ఊరట కలిగించేలా యష్ చొరవ తీసుకున్నాడని టాక్. రామాయణకి అదిరిపోయే ఓపెనింగ్స్ రావాలన్నా, మొదటి వారమే జనం తండోపతండాలుగా థియేటర్లకు పరిగెత్తాలన్నా పబ్లిసిటీ చాలా కీలకం కానుంది.