బన్సాలీ సినిమాలో రక్తపాతమా?

బాలీవుడ్లో గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలీకి పేరుంది. ఆయన తీసిన తక్కువ సినిమాలే అయినా.. వాటిలో కళాఖండాలే ఎక్కువ. హమ్ దిల్ కే చుకే సనమ్, దేవదాస్, బాజీరావు మస్తాని, పద్మావత్.. ఇలా బన్సాలీ తీసిన పలు చిత్రాలు ఆయన ఎంత గొప్ప దర్శకుడో రుజువు చేశాయి. ప్రతి ఫ్రేమ్‌లో ఒక క్లాసిక్ ఫీల్ తీసుకురావడం బన్సాలీకే చెల్లు. ఎంతో కళాత్మకంగా ఉండే ఆయన సినిమాల్లో వయొలెన్స్ కనిపించదు. ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ లాంటి యుద్ధ నేపథ్యం ఉన్న సినిమాల్లో కూడా హింసకు పెద్దగా చోటివ్వలేదు. తెరకు రక్తం అంటించలేదు.

అలాంటి దర్శకుడు ఇప్పుడు తన కొత్త సినిమా నుంచి రక్తంతో నిండిన ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ లెజెండరీ డైరెక్టర్.. రణబీర్ కపూర్‌తో ‘లవ్ అండ్ వార్’ అనే సినిమా తీస్తున్నాడు. ఆ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కారు నడుపుతూ ఒక చేతిని కిందికి విడిచిపెట్టి కనిపించాడు రణబీర్ ఇందులో. ఆ చేతికి మొత్తం రక్తం అంటుకుని ఉంది.

మీసంతో రణబీర్ లుక్ కొత్తగా ఉంది కానీ.. ఈ బ్లడ్డు చూస్తే మాత్రం అందరికీ ‘యానిమల్’ సినిమా గుర్తుకు వస్తోంది. బన్సాలీ కూడా ఈ వయొలెన్స్ మాయలో పడిపోయాడా.. ఆయన సినిమాల్లో కూడా రక్తపాతం చూపిస్తే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బన్సాలీ సొంత నిర్మాణ సంస్థలో తీస్తున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. 2027 జనవరి 21న ‘లవ్ అండ్ వార్’ రిలీజ్ కానుంది. అంటే నవంబరు 8న ‘రామాయణం’ లాంటి భారీ చిత్రంతో పలకరించబోతున్న రణబీర్.. ఇంకో రెండున్నర నెలలకే ఇంకో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడన్నమాట. ఇందులో రణబీర్ భార్య ఆలియా భట్ కథానాయికగా నటిస్తుండగా.. విక్కీ కౌశల్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మరి బన్సాలీ తెరపై ఎలాంటి బ్లడ్ బాత్ చూపిస్తాడు.. సినిమాలో తన క్లాసిక్ టచ్ ఉంటుందా అన్నది ఆసక్తికరం.