విడుదల ముంగిట క్రేజున్న సినిమాలకు ముందే సీక్వెల్స్ ప్రకటిస్తుంటారు. లేదంటే సినిమా చివర్లో ఆ దిశగా లీడ్ ఇస్తుంటారు. కానీ ఇలా చెప్పిన ప్రతి సినిమాకూ సీక్వెల్ వచ్చేస్తుందన్న గ్యారెంటీ లేదు. ఘనంగా అనౌన్స్‌మెంట్లు ఇచ్చి.. తర్వాత సీక్వెల్ తీయని సినిమాలు చాలానే ఉన్నాయి. గత ఏడాది విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన ‘కింగ్డమ్’ సినిమాకు కూడా పార్ట్-2 తీయాల్సి ఉంది. ఒక కథను రెండు భాగాలు చేసి.. గత ఏడాది పార్ట్-1ను మాత్రమే రిలీజ్ చేశారు. మధ్యలో ఆగిన ఆ కథను ‘కింగ్డమ్-2’గా తీయాలని అనుకున్నారు.
కానీ పార్ట్-1 ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తర్వాత అడుగులు ముందుకు పడలేదు. ముందేమో పార్ట్-2 ఉంటుందని అన్న నిర్మాత నాగవంశీ.. తర్వాతేమో ఆశించిన ఫలితం రాలేదు కదా, పార్ట్-2 ఎలా తీస్తాం అన్నట్టు దాని గురించి పట్టించుకోనట్టు తెలిసింది. కట్ చేస్తే.. ఇప్పుడు నాగవంశీ బేనర్లో తెరకెక్కిన మరో చిత్రం విషయంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఆ చిత్రమే.. ఎపిక్.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ చేసిన ‘ఎపిక్’ నుంచి ఇప్పుడు రిలీజైంది ‘ఫస్ట్ సెమిస్టర్’ మాత్రమే. ‘ఫైనల్ సెమిస్టర్’ పేరుతో ఇంకో సినిమా తీసి ఈ కథను ముగిస్తానని దర్శకుడు ఆదిత్య హాసన్ ముందే ప్రకటించాడు. సినిమాలో కూడా ఆ దిశగా లీడ్ ఇచ్చారు. కథ కూడా మధ్యలో ఆగిపోయింది. ఐతే ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాలేదు. రిలీజ్ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఎపిక్’.. తొలి రోజే డల్ అయిపోయింది. వీకెండ్లో తక్కువ వసూళ్లతో సరిపెట్టుకుంది.
సోమవారం నుంచి ఈ సినిమా రన్ నామమాత్రమే అన్నది స్పష్టం. బాక్సాఫీస్ దగ్గర ఇది పెద్ద డిజాస్టర్ అయిందనడంలో సందేహం లేదు. ఐతే రిలీజ్ రోజు పెట్టిన సక్సెస్ ప్రెస్ మీట్లో దర్శక నిర్మాతలు ఇస్తూ.. పార్ట్-2 ఉంటుందని బల్లగుద్ది చెప్పారు. ఐతే రిలీజ్ రోజు సినిమా రిజల్ట్ మీద క్లారిటీ లేక అలా చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఫలితమేంటో తేలిపోయింది కాబట్టి.. ఇక ‘ఫైనల్ సెమిస్టర్’ను అటకెక్కించే అవకాశాలే ఎక్కువ. ఒక సినిమా ఫ్లాప్ అని తెలిసీ.. పార్ట్-2 తీస్తే ఏమవుతుందో ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ రిజల్ట్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates