సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఇంకా చాలా టైం ఉన్నట్టు కనిపిస్తోంది కానీ పండక్కు పోటీలో ఉన్న ఇతర సినిమాలు పబ్లిసిటీ విషయంలో ఒకటి రెండు అడుగులు ముందే ఉంటున్నాయి. కానీ ఎప్పుడో షూటింగ్ పూర్తయిందని చెప్పుకుంటున్న సుప్రీమ్ హీరో మూవీ మాత్రం ప్రచార పర్వం మీద ఇంకా దృష్టి పెట్టడం లేదు.
ఒకవైపు స్వంత మావయ్య చిరంజీవి సంక్రాంతికి కాకా, విశ్వంభర రెండింటిలో ఏది విడుదల చేయించాలనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏది వచ్చినా దానితో నేరుగా తలపడటం సాయి దుర్గ తేజ్ కి ఇష్టం ఉండకపోవచ్చు. అయితే నిర్మాత నిరంజన్ రెడ్డి మాత్రం దీనికి పెట్టిన బడ్జెట్, స్కేల్ కి అప్పుడైతేనే వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారట. అందులోనూ ప్రశాంత్ వర్మ మహాకాళికి పోటీగా ఖచ్చితంగా తన చిత్రం ఉండాలనే పట్టుదల చూపిస్తున్నారని వినికిడి.
వినడానికి ఇలాంటివి బాగానే ఉంటాయి కానీ ఇప్పటికే బడ్జెట్ చేతులు దాటిపోయిన సంబరాల ఏటిగట్టు ఒకేసారి అయిదారు సినిమాలతో గుంపులో రావడం కంటే ఏదైనా సోలో డేట్ చూసుకుంటే బెటరనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఎందుకంటే ఈ మూవీలో దేవుడి అంశాలు, ఫాంటసీలు, కామెడీలు ఉండవు. కెజిఎఫ్ తరహాలో సీరియస్ గా సాగే ఎలివేషన్ డ్రామా. బోలెడు యాక్షన్ ఉంటుంది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని బయ్యర్లు కోరుతున్నారట.
ఇవన్నీ మాకు వద్దు మేము వచ్చేస్తాం అనుకుంటే ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు కానీ నేరుగా మామ అల్లుడు క్లాష్ పడితే మాత్రం బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా మారుతుంది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన సంబరాల ఏటిగట్టులో సాయికుమార్, జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి సీనియర్ హీరోలు కీలక పాత్రలు పోషించారు. ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడాదికి పైగా జరిగిన ఆలస్యానికి ఇప్పటికైనా మోక్షం దక్కాలని సినీ ప్రియుల కోరిక.
Gulte Telugu Telugu Political and Movie News Updates