టాలీవుడ్లో ఎక్కువగా కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న సంగీత దర్శకుల్లో తమన్ ఒకడు. అతడి పాటలు చాలా వాటికి వేరే పాటలతో పోలికలు కనిపిస్తాయి. కొన్ని విదేశీ మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి తమన్ ట్యూన్స్ లేపుకొచ్చేశాడని ఆధారాలతో చూపించే వీడియోలు యూట్యూబ్‌లో చాలా కనిపిస్తాయి. అలాగే తన పాటల్నే తనే తమన్ కాపీ కొడుతుంటాడని.. ట్యూన్లు రిపీట్ చేస్తుంటాడని కూడా విమర్శలున్నాయి.
ఐతే గతంతో పోలిస్తే సోషల్ మీడియాలో తమన్ మీద దాడి తగ్గినప్పటికీ.. అప్పుడప్పుడు ఇలాంటి విమర్శలు, ఆరోపణలు మాత్రం వస్తూనే ఉంటాయి. ఇంతకుముందే కొన్నిసార్లు వీటిపై స్పందించిన తమన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి తన వెర్షన్ వినిపించాడు.
కాపీ విమర్శలను తాను అస్సలు పట్టించుకోనని.. ఒకవేళ తాను కాపీ కొడితే తన టీంలో ఎవరూ కనుక్కోలేరా అని తమన్ ప్రశ్నించాడు. తాను పరిశ్రమలో ఎంతోమంది పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలతో పని చేశానని.. ఇంతమందిలో ఎవరూ తన ట్యూన్లు కాపీ అయితే తెలుసుకుని అడగరా అని తమన్ ప్రశ్నించాడు.
పని లేని వాళ్లు.. సంగీత పరిజ్ఞానం లేని వాళ్లే సోషల్ మీడియాలో ఊరికే విమర్శలు చేస్తుంటారని తమన్ అన్నాడు. కాపీ కొడితే ఎవరూ ఊరుకోరని.. తాను వందకు పైగా సినిమాలు చేస్తే ఇప్పటిదాకా ఏ కంపెనీ తనపై ఒక్క కేసు కూడా పెట్టలేదంటే ఏమని అర్థం అని తమన్ ప్రశ్నించాడు. కాబట్టి తనపై వచ్చే విమర్శలు, ఆరోపణలు అర్థం లేనివని, వాటిని పట్టించుకోకుండా తాను ముందుకు వెళ్లిపోతుంటానని తమన్ స్పష్టం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates