రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై యాప్ లో మొదటి పాటను అందుబాటులోకి తెచ్చింది. రాముడి గుణగణాలను వివరిస్తూ శ్రేయ ఘోషల్, అర్జిత్ సింగ్, కుమార్ విశ్వాస్ గాత్రంలో చాలా మెలోడియస్ గా ఉంది. రెహమాన్ మార్కు వాయిద్యాలతో పాటు ట్యూన్ కూడా పండగల సందర్భంలో మళ్ళీ మళ్ళీ పెట్టుకునేలా ఉంది. అయితే గొప్ప సాంగ్ గా నిలిచిపోతుందా లేదానేది వేచి చూడాలి.

తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ వెర్షన్లను క్రమంగా రిలీజ్ చేయబోతున్నారు. నాలుగు వేల కోట్లతో రెండు భాగాలు తీసినట్టుగా నిర్మాత నమిత్ మల్హోత్రా చెబుతున్న ప్రకారం ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి గ్రాండియర్ రాలేదు. అయితే ట్రైలర్ మీద పాజిటివ్ నెగటివ్ రెండు కామెంట్స్ వినిపించడంతో అసలు కంటెంట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి మూవీ లవర్స్ లో ఉంది. దీపావళి పండగ సందర్భంగా నవంబర్ 6 లేదా 8 విడుదల కానున్న రామాయణకు నితేశ్ తివారి దర్శకుడు.

బిజినెస్ డీల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. తెలుగు హక్కులు ఎవరికి ఫైనల్ అవుతాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. టాక్సిక్ విషయంలో నష్టపోయిన దిల్ రాజుకే ఒప్పందం ఓకే అవ్వొచ్చనే ప్రచారం యష్ వర్గాల వైపు నుంచి వినిపిస్తోంది. ఇంకా టైం ఉంది కాబట్టి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటించిన రామాయణలో రావణుడిగా యష్, హనుమతుడిగా సన్నీ డియోల్ పాత్రలు ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి.

విడుదల నాటికీ హైప్ అమాంతం పెంచేలా ప్రమోషన్స్ సిద్ధం చేస్తున్నారని ముంబై మీడియా టాక్. రామాయణ వస్తోందని పోటీ లేకుండా పోలేదు. సూర్య సీన్, నయనతార మహాశక్తి, ధనుష్ ఓం లాంటివి మాకూ ఆ పండగ కావాలని డేట్లు వేసుకుంటున్నాయి. తెలుగులోనూ ఒకటి రెండు పెద్ద సినిమాలు ఆ స్లాట్ వైపు చూస్తున్నాయి కానీ ఇంకా డెసిషన్ తీసుకోలేదు. జిమ్స్ హ్యామర్, రెహమాన్ సంయుక్తంగా సంగీతం సమకూర్చిన రామాయణలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు.