ఎపిక్ మీద A ప్రభావం నిజంగా ఉంటుందా

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మీద యూత్ వర్గాల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇవాళ విజయ్ దేవరకొండ అతిథిగా జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైప్ మరింత పెరుగుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. ఎలాగూ నిర్మాత నాగవంశీ కాన్ఫిడెన్స్ స్పీచ్ రూపంలో బయట పడుతుంది కాబట్టి అది కూడా బజ్ కి తోడ్పడే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా ఎపిక్ కు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం గురించి మూవీ లవర్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఎందుకంటే బోల్డ్ కంటెంట్, వయొలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలకు ఏ ఇవ్వడం సర్వసాధారణం. సలార్, యానిమల్ లాంటివి ఈ ముద్రతోనే వందల కోట్లు వసూళ్లు తీసుకొచ్చాయి. ఎపిక్ మొదటి క్యాటగిరీ కాదు. లవ్, రొమాన్స్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ అనే నాలుగు అంశాల మీద దర్శకుడు ఆదిత్య హాసన్ దీన్ని రాసుకున్నారు. తండ్రి సెంటిమెంట్ బలంగా దట్టించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ కొనసాగింపు అయినప్పటికీ పూర్తిగా డిఫరెంట్ ఫ్లేవర్ లో తీసుకెళ్లారు.

అయితే ఏ ఎందుకు వచ్చిందనే సందేహం రావడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కథానుగుణంగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య తీసిన కొన్ని సన్నివేశాలు కొంచెం బోల్డ్ గా ఉన్నాయట. ఎబ్బెట్టుగా అనిపించకపోయినా పిల్లల కోణంలో ఆలోచించిన అధికారులు దీన్ని అడల్ట్ కంటెంట్ గా భావించి ఉండొచ్చని సమాచారం. అయితే దీని ప్రభావం ఓపెనింగ్స్ లేదా టాక్ మీద ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే జెన్ జీ జనాలు వీటిని అంత సీరియస్ గా శల్యపరీక్ష చేయకపోవచ్చు.

కనెక్ట్ అయ్యేలా పాయింట్ చెబితే చాలు ఆటోమేటిక్ గా వసూళ్లు వచ్చేస్తాయి. అయితే హుషారు పిట్టలుకి యు/ఏ ఇచ్చినప్పుడు మరి ఎపిక్ మాత్రం ఏ ఎందుకు దక్కించుకుందనే ప్రశ్నకు సమాధానం సెప్టెంబర్ 11 థియేటర్లలోనే దొరకనుంది. బేబీ తర్వాత బాగా గ్యాప్ వచ్చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలకు ఈ సక్సెస్ చాలా కీలకం కానుంది. వెబ్ సిరీస్ నుంచి సినిమా వైపుకి వచ్చిన ఆదిత్య హాసన్ డెబ్యూతోనే సూపర్ హిట్ కొడతాననే నమ్మకం సంపూర్ణంగా వ్యక్తం చేస్తున్నారు