సుకుమార్ మీద ఒక బుక్కు

ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో రాజమౌళి తర్వాతి స్థానం ఎవరిది అంటే మరో మాట లేకుండా సుకుమార్ పేరు చెప్పేయొచ్చు. టాలీవుడ్లోనే కాదు.. దేశం మొత్తంలో మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. కేవలం హిట్లు కొట్టడం వల్లే ఆయన గొప్ప స్థాయికి వెళ్లలేదు. విలక్షణమైన కథలు ఎంచుకుని.. తన స్క్రీన్ ప్లే మాయాజాలంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడం ద్వారా ఆయన ఆ స్థాయిని అందుకున్నాడు. ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ మూవీతో కూడా గౌరవం దక్కించుకున్న దర్శకుడాయన. 

సుకుమార్‌ను మిగతా దర్శకుల కంటే భిన్నంగా నిలబెట్టేది ఆయన స్క్రీన్ ప్లే మాయాజాలమే. ఈ విషయంలో ఆయన్ని మ్యాచ్ చేసే టెక్నీషియన్ ప్రస్తుతం తెలుగులో ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. మామూలుగా దర్శకులకు సామాన్య ప్రేక్షకుల్లో వీరాభిమానులుంటారు. కానీ తన నైపుణ్యంతో సినీ పరిశ్రమలోనే వందల మంది వీరాభిమానులను సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్.

ఈ నేపథ్యంలోనే సుకుమార్ మీద ఇప్పుడో ప్రత్యేకమైన పుస్తకం రూపొందింది. డాక్టర్ ప్రవీణ్ యజ్ఞల అనే రచయిత.. ఈ విలక్షణ దర్శకుడి మీద ‘స్క్రీన్ ప్లే మాస్టర్ సుకుమార్’ అనే పుస్తకం రాశారు. దీనికి ‘కథ కాదు.. కథన శిల్పాన్ని పట్టి చూసే పరిశోధన’ అనే క్యాప్షన్ పెట్టారు ఈ పుస్తకానికి. లేటెస్ట్‌గా లాంచ్ అయిన ఈ పుస్తకం ఆల్రెడీ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. సినిమాలంటే ఇష్టపడేవారికే కాదు.. సినిమాల్లో పని చేయాలనుకునే వర్ధమాన రచయితలు, దర్శకులకు ఈ పుస్తకం కరదీపిక లాగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఈ పుస్తకం తొలి కాపీని సుకుమార్.. తన మిత్రుడు, నిర్మాత బన్నీ వాసుకు అందజేయడం విశేషం. ఈ విషయాన్ని చాలా ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు బన్నీ వాసు. ఇక సుకుమార్ కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ఆయన్నుంచి 2024లో ‘పుష్ప-2’ సినిమా వచ్చింది. దీని తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రూపొందించబోయే చిత్రానికి స్క్రిప్టు లాక్ అయింది. ‘పెద్ది’ చిత్రీకరణలో అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న చరణ్.. అందుబాటులోకి రాగానే చిత్రీకరణ మొదలుపెట్టాలని చూస్తున్నాడు సుకుమార్.