చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదు. ఈ రోజుల్లో ఒరిజినల్ కలెక్షన్లను పెంచి పోస్టర్లు వేయడం మామూలైపోయింది. ఎవ్వరూ ఆ నంబర్లను నమ్మట్లేదని తెలిసినా నిర్మాతలు మారట్లేదు. తాము ప్రకటించే కలెక్షన్లు ఒరిజినల్ కాదని స్వయంగా చెబుతూ.. అభిమానుల కోసమే ఇదంతా అంటూనే అవే ఫేక్ పోస్టర్లు దించుతూనే ఉన్నారు. ఈ ప్రాక్టీస్ మంచిది కాదని, మానుకోవాలని అనేవాళ్లు కూడా అందులో భాగం అవుతూనే ఉన్నారు.
ఈ ఒరవడిపై ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తన ప్రొడక్షన్లో వచ్చిన కొత్త సినిమా ‘రోమాంచకం’ సక్సెస్ మీట్లో కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేశాడు. టాలీవుడ్లో కలెక్షన్లు పెంచి చూపించడం చాలా మామూలు వ్యవహారం అయిపోయిందని, ఇది మంచిది కాదని ప్రణయ్ అన్నాడు.
ఉన్నదాని కంటే ఎక్కువ కలెక్షన్లు చూపించి ప్రచారం చేసుకోవడం వల్ల నిర్మాణ సంస్థకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చని.. కానీ అందులో భాగమైన నటీనటులు, టెక్నీషియన్లు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడతారని.. వారి మార్కెట్ మీద అది ప్రభావం చూపిస్తుందని ప్రణయ్ అభిప్రాయపడ్డాడు. సినిమాను మార్కెట్ చేసుకోవడం కోసం అబద్ధపు నంబర్లు చెప్పి ప్రచారం చేసినా.. ఒరిజినల్ ఫిగర్స్ ప్రొడక్షన్ హౌస్‌ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయని ప్రణయ్ అన్నాడు. తమ సినిమా ‘రోమాంచకం’ విషయంలో మాత్రం తాము తప్పుడు నంబర్లు వేయలేదని ప్రణయ్ స్పష్టం చేశాడు.
ఈ సినిమా నాలుగున్నర రోజుల్లో రూ.8.5 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రణయ్ తెలిపాడు. ఇందులో ఎంతమాత్రం ఫేక్ లేదని.. ఈ నంబర్లనే అఫీషియల్ పోస్టర్ల మీద కూడా వేస్తున్నామని.. బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్ సైట్లలో కూడా ఇవే వివరాలు చూసుకోవచ్చని ప్రణయ్ తెలిపాడు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి రూపొందించిన ‘రోమాంచకం’ గత గురువారం రిలీజై మోడరేట్ రివ్యూలు తెచ్చుకున్నప్పటికీ.. వసూళ్ల పరంగా బాగానే పెర్ఫామ్ చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates