బాల‌య్య వెర్స‌స్ నాగ్.. భ‌లే మ‌జా

ఒక‌ప్పుడు టాలీవుడ్‌ను చాలా ఏళ్ల పాటు న‌లుగురు హీరోలు ఏలారు. ఆ న‌లుగురే.. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌. వీరిలో ఏ ఇద్ద‌రి సినిమాల‌ మ‌ధ్య క్లాష్ వ‌చ్చినా బాక్సాఫీస్ వేడెక్కిపోయేది. కానీ త‌ర్వాత చాలామంది స్టార్లు రావ‌డంతో వీరి బాక్సాఫీస్ పోరుకు ప్రాధాన్యం కొంత త‌గ్గింది. అయినా చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య ఖైదీ నంబ‌ర్ 150-గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. వాల్తేరు వీర‌య్య‌-వీర‌సింహారెడ్డి చిత్రాల క్లాష్ జ‌రిగిన‌పుడు ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది.

ఐతే బాల‌య్య‌, నాగార్జున మ‌ధ్య మాత్రం డైరెక్ట్ క్లాష్ జ‌రిగి చాలా కాలం అయిపోయింది. 2016లో సోగ్గాడే చిన్నినాయ‌నా, డిక్టేట‌ర్ సినిమాలు త‌ల‌ప‌డ్డా.. అప్పుడు వేరే చిత్రాలు కూడా పోటీలో ఉండ‌డంతో నాగ్, బాల‌య్య క్లాష్ మూవీ ఎక్కువ ఫోక‌స్ నిల‌వ‌లేదు. ఐతే ఈ ఏడాది క్రిస్మ‌స్ సీజ‌న్లో ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు డైరెక్ట్ క్లాష్‌కు రెడీ అయిపోయారు.

నాగ్ వందో సినిమా ఆల్రెడీ డిసెంబ‌రు 24న విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే కింగ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. అది క్రేజీగా ఉండి అక్కినేని అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల దృష్టిని కూడా ఆక‌ర్షించింది. త‌న‌కు బాగా క‌లిసొచ్చి డిసెంబ‌రులో వందో సినిమాను తీసుకొస్తుండ‌డంతో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మ‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

ఐతే ఇప్పుడు బాల‌య్య కొత్త సినిమాను కూడా డిసెంబ‌రు 24కే ఫిక్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గోపీచంద్ మ‌లినేనితో వీర‌సింహారెడ్డి త‌ర్వాత‌ బాల‌య్య చేస్తున్న చిత్రానికి దాదా అనే టైటిల్ ఖాయం చేశారు.
ముంబ‌యి నేప‌థ్యంలో న‌డిచే ఈ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా నుంచి రిలీజ్ చేసిన టీజ‌ర్ బాల‌య్య అభిమానుల‌తో పాటు మాస్ ప్రేక్ష‌కులనూ ఆక‌ట్టుకుంది.

చాలా ఏళ్ల త‌ర్వాత నాగ్, బాల‌య్య మ‌ధ్య ఒకే రోజు డైరెక్ట్ బాక్సాఫీస్ క్లాష్ చూడ‌బోతుండ‌డం తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎగ్జైట్మెంట్‌ను పెంచేదే. ఏవో కార‌ణాల‌తో వ్య‌క్తిగ‌తంగా ఈ నంద‌మూరి, అక్కినేని హీరోల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. ఇరువురి అభిమానుల్లోనూ వైరం పెరిగింది. ఈ నేప‌థ్యంలో నాగ్, బాల‌య్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌ల‌ప‌డితే.. రిలీజ్ టైంకి ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ఘ‌ర్ష‌ణ గ‌ట్టిగానే ఉండొచ్చేమో.