సంవత్సరాల తరబడి నందమూరి అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన మోక్షజ్ఞ తెరంగేట్రం ఫిక్స్ అయిపోయింది. బింబిసార, విశ్వంభర ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే భారీ చిత్రం అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. ఈ వార్త రెండు మూడు రోజుల క్రితమే లీకైనప్పటికీ హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ముహూర్తం ఫిక్స్ చేశారు. నిర్మాత, దర్శకుడితో మోక్షజ్ఞ ఫోటోలను సోషల్ మీడియాలో రివీల్ చేశారు. వాళ్ళతో పాటు బాలయ్య కూడా ఉన్నారు.
ఈ ప్రాజెక్ట్ బడ్జెట్, జానర్ ఏంటనేది పక్కన పెడితే వీలైనంత త్వరగా ఈ సినిమా విడుదల ఉండాలనేది సగటు ఫ్యాన్స్ కోరిక. ఎందుకంటే గతంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ వరకు వచ్చి పూజా కార్యక్రమాల దగ్గర ఆగిపోయింది. ఈసారి ఆ ఛాన్స్ లేదట. మోక్షజ్ఞ పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావడంతో పాటు అన్ని రకాలుగా తర్ఫీదునిచ్చాకే రంగంలోకి దించుతున్నారని ఇన్ సైడ్ టాక్. ఇరవై సంవత్సరాల నిరీక్షణకు ఎట్టకేలకు బ్రేక్ దక్కింది.
ఇక వసిష్ఠ విషయానికి వస్తే విశ్వంభర మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. సిజి పనులు చివరి దశకు వచ్చాయి. విడుదల ఎప్పుడు ఉంటుందనేది ఇంకా తేలలేదు కానీ ఇది కనక హిట్ అయితే వశిష్ఠకు కెరీర్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. అయితే మోక్షజ్ఞతో మూవీ ఒక రకంగా సవాల్ లాంటిది. ఎందుకంటే ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం అంత సులభం కాదు. పైగా సోషల్ మీడియాలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది కనక ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు.
ఇప్పటికే కొంత ఆలస్యం చేసిన మోక్షజ్ఞ కూడా స్పీడ్ గా కెరీర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సినిమాకి గ్యాప్ లేకుండా చూసుకుంటే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మార్కెట్ ఏర్పడుతుంది. పైగా బాలయ్య అభిమానుల అండదండలు దొరుకుతాయి కాబట్టి వాటిని నిలబెట్టుకునేలా స్పీడ్ పెంచితే చాలు. రామ్ చరణ్, మహేష్ బాబు, చైతు అఖిల్ తర్వాత మరో స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న వారసుడిగా ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ కళ్ళు తన మీదే ఉంటాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates