‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ చేస్తున్న ‘రాకా’ మీద మొదట్నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటిదాకా ఫ్లాప్ అన్నది లేని తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. సన్ పిక్చర్స్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తోంది. ఈ సినిమా గురించి బన్నీ, అట్లీ పెద్దగా మాట్లాడట్లేదు కానీ.. వేరే వాళ్లు ఎవరు మాట్లాడినా ఒక రేంజిలో ఎలివేషన్ ఇస్తున్నారు.

తాజాగా సీనియర్ నటుడు పృథ్వీ.. ‘రాకా’ గురించి అభిమానులు ఎగ్జైట్ అయ్యేలా మాట్లాడాడు. ఒకప్పుడు బిజీ నటుడిగా ఉన్న పృథ్వీకి మధ్యలో కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఈ మధ్య మళ్లీ బిజీ అవుతున్నాడు. ‘యానిమల్’లో చేసిన పాత్రతో ఆయన కెరీర్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే ‘రాకా’లోనూ ఒక కీలక పాత్రను దక్కించుకున్నాడట.

ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో డ్రీమ్ ప్రాజెక్టు అనదగ్గ సినిమాలో నటిస్తున్నా. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో సన్ పిక్చర్స్ వాళ్లు తీస్తున్న ‘రాకా’లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నా. బన్నీ, దీపికా పదుకొనేల కాంబినేషన్లో నాకు సన్నివేశాలున్నాయి. ఆ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. అక్కడి టెక్నీషియన్లు కూడా పని చేస్తున్నారు. అది చాలా పెద్ద సినిమా. అద్భుతంగా తీస్తున్నారు.

నాకు ఎలా ఉంటుందంటే.. ఈ రోజు నేను నటిస్తుంటే.. రేపే ఆ సినిమా రిలీజైపోవాలి అనిపిస్తుంది. కానీ వాళ్లు చాలా ఓపిగ్గా.. డీటైల్డ్‌‌గా, అందంగా సినిమా తీస్తున్నారు. సామాన్య ప్రేక్షకుల కంటే ముందు నేను ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పాడు.

‘రాకా’ను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తారని ముందు ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడేమో 2027 డిసెంబర్ రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నాయి. టీం త్వరలోనే ఈ రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే మూవీ నుంచి ఒక టీజర్ వదిలితే బాగుంటుందన్నది ఫ్యాన్స్ ఆశ.