లెనిన్ హిట్టయిందని సంబరపడేలోపే…

టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జునలతో పెద్ద పెద్ద సినిమాలు నిర్మించిన ఈ సంస్థ.. అప్పుడప్పుడూ తమ ఫ్యామిలీలోని మిగతా హీరోలతో, అరుదుగా బయటి వాళ్లతో సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. ఐతే గత దశాబ్ద కాలంలో ఈ సంస్థ జోరు బాగా తగ్గిపోయింది. సినీ నిర్మాణానికి ఒకప్పుడున్నంత అనుకూల పరిస్థితులు లేకపోవడం, ప్రొడక్షన్ అన్నది జూదంలా మారిపోవడంతో సినిమాలు తగ్గించేసింది.

ఒక దశలో ప్రొడక్షన్‌కు పూర్తిగా దూరం అయినట్లే కనిపించింది.
కానీ ఈ మధ్య మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్‌ మళ్లీ యాక్టివ్ అయింది. వరుసగా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టింది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్‌‌కు అనుబంధంగా కొత్తగా డిస్ట్రిబ్యూషన్ హౌస్ కూడా పెట్టారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ భాగస్వామి అయిన ‘లెనిన్’ సినిమా మంచి విజయం సాధించడం, అఖిల్‌ అక్కినేని కెరీర్‌ కూడా నిలబడడంతో అన్నపూర్ణ కాంపౌండ్లో పండుగ వాతావరణం నెలకొంది.

కానీ అన్నపూర్ణ బ్రాండుకు అంతలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. వేరే ప్రొడక్షన్ హౌస్‌లతో కలిసి ఆ సంస్థ నిర్మించిన రెండు సినిమాలు తక్కువ వ్యవధిలో బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. ‘పళ్ళబురుసు’ పేరుతో బలగం తరహా ప్రయోగాత్మక చిత్రం ఏదో ట్రై చేస్తే.. అది ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. ఏదో ఆశించి ఈ సినిమా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు చుక్కలు కనిపించాయి. చిన్న పాయింట్ పట్టుకుని విపరీతంగా సాగదీసి ఆడియన్స్‌తో హాహాకారాలు పెట్టించారు.

ఇక లేటెస్ట్‌గా అన్నపూర్ణ సంస్థ నుంచి ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా వచ్చింది. దీనికి టీం చాలా హైప్ ఇచ్చింది. తీరా చూస్తే ఔట్ డేటెడ్ కథాకథనాలతో ఈ సినిమా తీవ్ర నిరాశకు గురి చేసింది. నాగ్‌కు వీరాభిమాని, ఈ అక్కినేని హీరోతో ‘నా సామి రంగ’లో స్క్రీన్ షేర్ చేసుకున్న అల్లరి నరేష్‌ను పెట్టి తీసిన సినిమా వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ‘లెనిన్’ పెద్ద హిట్టయిందని సంతోషించేలోపే.. ఇప్పుడు మూడు వారాల వ్యవధిలో రెండు సినిమాలు డిజాస్టర్లు అయి అన్నపూర్ణ సంస్థకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.