మారెమ్మకు మాస్ రాజా ప్రోత్సాహం సరిపోతుందా

స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. మాస్ మహారాజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజుని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మారెమ్మ వచ్చే వారం సెప్టెంబర్ 10 విడుదల కానుంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రవితేజ ముఖ్యఅతిథిగా విచ్చేయగా ఆయనతో పాటు గెస్టులంతా మాధవ్ మీద తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ట్రైలర్ చూస్తే రా అండ్ రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి యాక్షన్ టచ్ తో రూపొందినట్టు కనిపిస్తోంది. విజువల్స్ గట్రా ఇంటెన్స్ తో ఉన్నాయి.

అయితే మాస్ రాజా మద్దతు మారెమ్మకు సరిపోతుందా అంటే ఔను కాదు రెండూ చెప్పలేం. ఎందుకంటే మాధవ్ ను ముందు నుంచి ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోగా ఎస్టాబ్లిష్ చేయలేదు. కొంచెం లో ప్రొఫైల్ మైంటైన్ చేశారు. బహుశా అది రవితేజ సలహానే అయ్యుండొచ్చు. ఎక్కువ హడావిడి చేసి, బిల్డప్ ఇచ్చి, పదే పదే తన పేరు వాడితే ఆడియన్స్ లోకి ఇంకోలా వెళ్లే రిస్క్ ఉంది కాబట్టి కంటెంట్ నే ఎక్కువ మార్కెటింగ్ చేయమని చెప్పి ఉండొచ్చు. అందుకే ఇలా చేశారేమో.

ఎలా ప్లాన్ చేసినా రవితేజ బ్రాండ్ అనేది మాధవ్ కి అంతో ఇంతో ఉపయోగపడుతుంది. కాకపోతే పోటీ అయితే గట్టిగా ఉంది. కార్తీ సర్దార్ 2 మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ ఎపిక్ గురించి ట్రేడ్ సర్కిల్స్ లో పాజిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి. సుమంత్ మహేంద్రగిరి వారాహి హఠాత్తుగా సౌండ్ తగ్గించింది కానీ దీన్ని తక్కువంచనా వేయడానికి లేదు. వీటికి తోడు రోమాంచకం, మీర్జాపూర్, బెత్లెహాం కుటుంబ యూనిట్లు రెండో వారం రన్ కొనసాగిస్తాయి.

ఎవరిదాకో ఎందుకు రవితేజ ఇరుముడినే ఇంకా పూర్తిగా స్లో కాలేదు. సో మారెమ్మకు ఇవన్నీ సవాళ్లు విసిరివే. ఒక పల్లెటూరి దైవంగా భావించే ఒక దున్నపోతు చుట్టూ అల్లుకున్న ఫాంటసీ కథ ఈ మారెమ్మ. గ్రామదేవత పేరు పెట్టారు కాబట్టి డివోషనల్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయి. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్ గా నటించింది. మాధవ్ లో మాస్ లుక్ అయితే బాగా కనిపిస్తోంది. మరి రవితేజ ఫ్యాన్స్ ని ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి.