తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద టైటిల్

తెలుగులో అసలే పేరే లేకుండా రిలీజైన సినిమా ఒకటుంది. జేడీ చక్రవర్తి నటించిన ఆ చిత్రానికి రిలీజ్ తర్వాత ‘పాపే నా ప్రాణం’ అని పేరు పెట్టారు. ఇక ఎ, నో, అ!, క.. ఇలా కేవలం ఒక అక్షరం టైటిళ్లతో రిలీజైన సినిమాలూ ఉన్నాయి. ఐతే ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద టైటిల్‌తో ఒక సినిమా రాబోతోంది. ఆ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు చంద్రసిద్దార్థ రూపొందిస్తుండడం విశేషం.

తన కొత్త చిత్రానికి ఆయన.. ‘‘ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే సుదీర్ఘమైన టైటిల్ పెట్టడం విశేషం.

ఈ టైటిల్ సరిపోదని.. ఈ చిత్రానికి ‘ ఎ ఫర్‌బిడన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’ అనే క్యాప్షన్ కూడా జోడించారు. తన సొంత సంస్థ ‘ఫిల్మోత్సవ్’లోనే చంద్రసిద్దార్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’ లాంటి చిత్రాలతో అభిరుచిని చాటిన చంద్రసిద్దార్థ.. ఆ తర్వాత గాడి తప్పాడు. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఆటగదరా శివా లాంటి ఆయన చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. దీంతో చాలా ఏళ్ల పాటు సినిమా చేయలేదు. ఐతే ఇప్పుడు ‘ఈ పాట కోరిన వారు..’తో తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

చంద్రసిద్దార్థ కెరీర్లో మరపురాని సినిమాగా నిలిచిపోయిన ‘ఆ నలుగురు’కు కథ అందించిన మదనే ఈ చిత్రానికి కూడా స్టోరీ ఇవ్వడం విశేషం. ఐతే మదన్ నాలుగేళ్ల కిందటే మరణించాడు. చనిపోవడానికి ముందు ఆయన చంద్రసిద్దార్థకు ఈ కథ ఇచ్చారు. మళ్లీ తమ కలయికలో సినిమా చేద్దామనుకునేలోపు మదన్ చనిపోయారని.. కానీ ఆయన కథతో ఈ సినిమాను పూర్తి చేశానని చంద్రసిద్దార్థ చెప్పాడు.

హర్ష హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అమైరా గోస్వామి, సుజనారెడ్డి, ఇనయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సైలెంటుగా షూటింగ్ పూర్తి చేసిన టీం.. నేరుగా అనౌన్స్‌మెంట్లోనే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ నెల 18నే ఈ పొడవాటి టైటిల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.