‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’తో ఆదిత్య హాసన్ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. చిన్న చిన్న కుటుంబ సంఘటనలు, స్కూల్ జ్ఞాపకాలు, మధ్యతరగతి జీవితాన్ని సింపుల్‌గా చూపించి వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే ఆదిత్య ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’తో సినిమా దర్శకుడిగా థియేటర్లలోకి వస్తున్నాడు. సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అతనికి కొత్త ఛాలెంజ్.
‘90స్’లో ఆదిత్యకు కథను ఎపిసోడ్లుగా చెప్పే అవకాశం ఉంది. ఇంటి చుట్టూ, స్కూల్ చుట్టూ తిరిగే చిన్న సంఘటనలే అక్కడ కథను నడిపించాయి. ‘ఎపిక్’లో మాత్రం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో పూర్తిస్థాయి ప్రేమకథను నడిపించాలి. పైగా ‘బేబీ’ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటించడం సినిమాకు ముందే గుర్తింపు తెచ్చింది.
ఆదిత్యకు థియేటర్ మార్కెట్ పూర్తిగా కొత్త కూడా కాదు. గతేడాది వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’కు నిర్మాతగా ఉన్నాడు. ఆ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకుడు. మౌళి లాంటి డిజిటల్ స్పేస్ నుంచి వచ్చిన నటుడితో చిన్న సినిమాను థియేటర్ల వరకు తీసుకెళ్లిన అనుభవం అప్పుడే వచ్చింది. ఇప్పుడు మాత్రం నిర్మాతగా కాదు, తాను రాసి తెరకెక్కించిన సినిమాతో డైరెక్ట్ గా బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు.
ఇక్కడ ‘ఓటీటీ కంటెంట్ థియేటర్‌లో పని చేస్తుందా?’ అనే పెద్ద లెక్క కంటే ఆదిత్య తన రైటింగ్‌ను ఎంత మార్చుకున్నాడన్నదే చూడాలి. ‘90స్’లో కుటుంబం, బాల్యం ప్రధానంగా ఉంటే ‘ఎపిక్’ లండన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకథగా వస్తోంది. తనకు పేరు తెచ్చిన అదే ప్రపంచాన్ని సినిమాగా పొడిగించకుండా మరో సెటప్ ఎంచుకోవడం కూడా ఇంట్రెస్టింగ్ విషయం.
పైగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, ఆనంద్ వైష్ణవి జోడీతో ఆదిత్యకు ఈసారి వెబ్ సిరీస్ కంటే పెద్ద చాన్స్ దొరికింది. ‘90స్’ చూసిన వాళ్లు దర్శకుడి పేరు గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ గుర్తింపుతో బాక్సాఫీస్ వద్ద టికెట్ కొంటారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates