ది ప్యారడైజ్ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమాకు వచ్చిన హైప్, దీనికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, తొలి రోజు వచ్చిన ఓపెనింగ్స్ అసామాన్యం. టైర్-1 హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో నిలబడిందీ సినిమా. పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే.. కలెక్షన్లు ఊహకు అందని విధంగా ఉండేవి. ఐతే విపరీతమైన నెగెటివ్ టాక్ ఉన్నా సరే.. వీకెండ్ వరకు ది ప్యారడైజ్ బలంగానే నిలబడేలా ఉంది. ఈ చిత్రంతో నాని తన లెవెలేంటో చూపించాడు.
కొన్నేళ్ల ముందు వరకు ఫుల్ రన్లో 50 కోట్ల వసూళ్లు రావడం గొప్ప అనే స్థాయిలో ఉన్న హీరో.. ఇప్పుడు ఒక్క రోజులో రూ.80 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టడం అన్నది అసామాన్యం. ఈ విషయంలో ది ప్యారడైజ్ ప్రోమోలు, పాటలు కీలక పాత్ర పోషించాయి. ఐతే నాని ఈ సినిమాతో సాధిస్తున్న ఘనతల గురించి అభిమానులు కొనియాడడం వరకు ఓకే కానీ.. వేరే స్టార్లతో పోల్చి వారిని కించపరిచే ప్రయత్నం చేయడం మాత్రం సబబుగా లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ హైయెస్ట్ డే-1 కలెక్షన్లను ది ప్యారడైజ్ దాటేసిందని.. ఓవరాల్ కలెక్షన్లతో పాటు యుఎస్ ప్రిమియర్స్‌లోనూ సూపర్ స్టార్‌ను నేచురల్ స్టార్ దాటేశాడని సోషల్ మీడియాలో నానికి ఎలివేషన్లు ఇస్తున్నారు. ఇది మహేష్ అభిమానులకు సహజంగానే మంట పుట్టిస్తుందని చెప్పాల్సిన పని లేదు.
సాధారణంగా నానికి అందరు హీరోల అభిమానుల నుంచీ మద్దతు లభిస్తుంది. అతడి మీద నెగెటివిటీ తక్కువ. కానీ ఇలాంటి అనవసర పోలికలు తెచ్చి.. నాని మీద మహేష్ అభిమానుల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నానికి ది ప్యారడైజ్ మూవీతో అనుకోకుండా కలిసి వచ్చింది, దీని హైప్ వల్ల ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి.
ఐతే అంతిమంగా సినిమా ఏ స్థాయిలో నిలబడుతుందో కూడా చూడాలి. నాని తర్వాతి సినిమాకు కూడా ఇదే ఫీట్ రిపీట్ చేయగలడా అంటే ఔనని చెప్పలేని పరిస్థితి. కన్సిస్టెంట్‌గా ఇలాంటి ఓపెనింగ్స్ రాబట్టి, హిట్స్ కొడితేనే.. అతడిని పెద్ద హీరోల సరసన నిలబెట్టగలం.
బేసిగ్గా మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, తన బిజినెస్ వేరే లెవెల్లో ఉంటాయన్నది తెలిసిందే. రేప్పొద్దున వారణాసి రిలీజ్ అయ్యాక మహేష్ ఏ స్థాయిలో ఉంటాడో వేరే చెప్పాలా? కాబట్టి ఈ అనవసర పోలికలతో నాని ఫ్యాన్స్.. మహేష్‌ను తక్కువ చేయడం, తమ హీరో మీద నెగెటివిటీ పెంచడం మానుకుంటే మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates