80, 90 దశకాల్లో తెలుగు సినిమాల్లో వైభవం చూసిన హీరోల్లో సుమన్ ఒకడు. కొన్ని సూపర్ హిట్లతో అప్పటి టాప్ 4 హీరోలకు గట్టి పోటీ ఇచ్చాడాయిన. ఐతే తర్వాత హీరోగా మార్కెట్ కోల్పోయి.. క్యారెక్టర్, విలన్ రోల్స్ వైపు మళ్ళిన ఈ నటుడు ఇప్పుడు అరుదుగా సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా ఆయన ఇప్పటి సినిమాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
ఇప్పటి ఫిలిం మేకర్లకు సామాజిక బాధ్యత ఉండట్లేదని.. కొన్ని సినిమాలు సమాజాన్ని నాశనం చేసేలా ఉంటున్నాయని ఆయన మండిపడ్డారు. సెన్సార్ బోర్డు తీరు మీద కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అసభ్యకర, తీవ్ర హింసాత్మక కంటెంట్ ను సెన్సార్ ఎలా అనుమతిస్తోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్ళి ఆస్వాదించేలా ఉండేవని.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కుటుంబ సభ్యులు విడివిడిగా థియేటర్లకు వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకునే పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికే పిల్లలు, యువత.. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో పెడదోవ పడుతున్నారని. ఇలాంటి సమయంలో సినిమాల ద్వారా వారి మెదళ్లలో వికృత ఆలోచనలను నాటి చెడు వైపు మళ్లించడం ఎంతవరకు సమంజసమని సుమన్ ప్రశ్నించారు.
సినిమా అనేది సమాజాన్ని ప్రభావితం చెయ్యగల ఎంతో శక్తివంతమైన మాధ్యమం అని.. దీని ద్వారా ప్రజల జీవన విధానాన్ని, ప్రవర్తనను మార్చవచ్చని సుమన్ అభిప్రాయ పడ్డారు. విలువలు, సందేశాత్మక అంశాలు, మానవ సంబంధాలను పెంపొందించే కథలతో సమాజంలో మంచి మార్పు తేవచ్చని ఆయన అన్నారు.
కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లు, వ్యాపార ప్రయోజనాలకు పరిమితం కాకుండా.. సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలని దర్శక నిర్మాతలను ఆయన కోరారు. సెన్సార్ బోర్డు కూడా బాధ్యతతో ఉంటూ, మంచి సినిమాలు వచ్చేలా చూడాలని సుమన్ హితవు పలికారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates