నిర్మాత మాట… సినిమాలు ఊరికే ఆడట్లేదు

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. కానీ తర్వాత నాలుగు నెలల పాటు బాక్సాఫీస్‌లో హాహాకారాలు తప్పలేదు. నిఖార్సయిన ఒక్క హిట్టు కూడా పడకపోవడంతో ఇండస్ట్రీ జనాలు కంగారు పడిపోయారు. ఇక జనం థియేటర్లకు రారేమో అని ఆందోళన చెందారు. కానీ జూన్‌లో ‘పెద్ది’ సినిమా వచ్చినప్పటి నుంచి థియేటర్లలో సందడి మామూలుగా లేదు.

అప్పట్నుంచి కనీసం రెండు వారాలకోసారి మంచి సినిమా పడుతోంది. థియేటర్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’తో టాలీవుడ్ డ్రీమ్ రన్ ఇంకో లెవెల్‌కు చేరింది. ఐతే ఈ మూడు నెలలు సినిమాలు ఊరికే ఏమీ ఆడలేదని.. ఇందులో ఒక ప్యాటర్న్ ఉందని.. టాలీవుడ్‌కు అది భలేగా కలిసొస్తోందని.. సీనియర్ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవిశంకర్ విశ్లేషించారు. ‘రంభ ఊర్వశి మేనక’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయన దీని మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘జూన్ నెల నుంచి సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయంటే ఊరికే ఏం కాదు. మనం గమనించాల్సిన ఒక ప్యాటర్న్ అందులో ఉంది. ఈ మూడు నెలల్లో వచ్చిన ఒక సినిమాకు ఇంకో సినిమాకు పోలిక ఉండదు. ‘పెద్ది’ ఒక భారీ చిత్రం నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. తర్వాత ‘మా ఇంటి బంగారం’ రూపంలో మంచి ఫ్యామిలీ మూవీ పడింది. ఆపై ‘లెనిన్’లో కొత్త అనిల్‌ను చూపించి రూరల్ డ్రామాను బాగా పండించారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒక గ్రౌండెడ్ అవ్ స్టోరీ. ‘కొరియన్ కనకరాజు’ డిఫరెంట్ హార్రర్ మూవీ.

ఇక ‘ఇరుముడి’ ఏమో సీరియస్ ఎమోషన్లతో ప్రేక్షకులను కదిలించే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో ఏ చిత్రాన్నీ ఇంకో చిత్రంతో పోల్చలేం. దేనికదే భిన్నం. మీరు ఇలా డిఫరెంట్ మూవీస్ అందించండి. మేం థియేటర్లకు వచ్చి సినిమా చూస్తాం అని ప్రేక్షకులు ఇండికేషన్ ఇచ్చారు. ఈ కోవలోనే ‘రంభ ఊర్వశి మేనక’ లాంటి ఇంకో డిఫరెంట్ జానర్ సినిమా వస్తోంది. అది కూడా బాక్సాఫీస్ డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తుంది’’ అని రవిశంకర్ విశ్లేషించారు. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘రంభ ఊర్వశి మేనక’ శుక్రవారం రిలీజ్ కానుంది.