సుడిగాడు-2… వామ్మో అంటున్న అల్లరి నరేష్

తెలుగులో కామెడీ సినిమాలతోనూ స్టార్ కావచ్చని ముందుగా రుజువు చేసింది రాజేంద్ర ప్రసాద్ అయితే.. ఆయన తరువాత ఆ స్థాయిలో కామెడీ చిత్రాలతో అలరించిన ఘనత అల్లరి నరేష్ దే.. తొలి సినిమా ‘అల్లరి’తో మొదలుపెట్టి తొట్టి గ్యాంగ్, అత్తిలి సత్తిబాబు, కితకితలు, బెండు అప్పారావు, సుడిగాడు.. ఇలా అనేక కామెడీ చిత్రాలతో అతను ప్రేక్షకులను మామూలుగా నవ్వించలేదు. కానీ ఒక దశ దాటాక అతడి కామెడీ సినిమాలను జనాలకు మొహం మొత్తేశాయి.

ముఖ్యంగా ‘సుడిగాడు’తో హై డోస్ కామెడీ అందించాక.. తర్వాతి చిత్రాలు ప్రేక్షకులకు ఆనలేదు. వరుస ఫ్లాపులతో అతను రేసులో వెనుకబడిపోయాడు. కామెడీ సినిమాలు వర్కవుట్ కావట్లేదని సీరియస్ సినిమాల వైపు మళ్ళిన అల్లరోడు నాంది మూవీతో మెప్పించినా.. ఆ తర్వాతి సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు రంభ ఊర్వశి మేనక మూవీతో మళ్ళీ కామెడీ ట్రై చేస్తున్నాడు నరేష్.

ఈ నేపథ్యంలో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సుడిగాడు సీక్వెల్ గురించి అడిగితే.. ఒకింత కంగారు పడిపోయాడు అల్లరోడు. సుడిగాడు తమిళ హిట్ తమిళ్ పడంకి రీమేక్ కాగా.. అక్కడ దానికి సీక్వెల్ వచ్చి అదీ హిట్ అయింది. మరి తెలుగులో సుడిగాడు-2 ఎప్పుడు అని అడిగితే ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే అనేశాడు నరేష్. సుడిగాడు సీక్వెల్ గురించి తనను చాలామంది అడుగుతుంటారని.. ఆ మాట వింటే తనకు టెన్షన్ వచ్చేస్తుందని నరేష్ తెలిపాడు.

కామెడీ ఈ రోజుల్లో చాలా సున్నితంగా తయారైందని అతను ఆందోళన వ్యక్తం చేశాడు. సుడిగాడు లో మాదిరి ఇప్పుడు స్పూఫులు, పేరడీలు చేస్తే అభిమానుల మనోభావాలు దెబ్బ తిని ఫ్యాన్ వార్స్ జరిగిపోతాయని అతనన్నాడు. కితకితలు సినిమా ఇప్పుడు తీస్తే బాడీ షేమింగ్ చేశారు అని గొడవ చేస్తారని నరేష్ అభిప్రాయపడ్డాడు.

కలర్, కాస్ట్ ఇలా దేని గురించి మాట్లాడినా ఇప్పుడు వైరల్ అయిపోతుందని.. ఇలాంటి పరిస్థితుల్లో కామెడీ చెయ్యడం కత్తి మీద సాములా మారిందని అన్నాడు నరేష్. గతంలో ఒక కమెడియన్ని తెరపై ఇంకో కమెడియన్ కొడితే నవ్వే వారని.. ఇప్పుడు అమానవీయం అని కామెంట్ చేసే పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియా జనాలను ఎంత సున్నితంగా మార్చేసిందో వివరించాడు అల్లరోడు.