వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా సామిరంగా తర్వాత సోలో హీరోగా ఆయన దర్శనం లేకపోవడంతో ఈ ల్యాండ్ మార్క్ మూవీని ఘనంగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే వచ్చిన టీజర్ లో నాగ్ స్టయిలింగ్, దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. అసలు కంటెంట్ ట్రైలర్ రూపంలో రావాల్సి ఉంది కాబట్టి అప్పుడు అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతాయి.
అయితే ఫ్యాన్స్ ముందు నుంచి నాగార్జున నుంచి ఒకటి కోరుకుంటున్నారు. అదేంటంటే ఇతర హీరోల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ లేదా సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడం కానీ వద్దని. దానికి కారణం లేకపోలేదు. కూలిలో మొదటిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర చేస్తే ఎంత మాత్రం వర్కౌట్ కాలేదు. అంత పెద్ద లోకేష్ కనగరాజ్ సైతం సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇక కుబేర సంగతి సరేసరి. శేఖర్ కమ్ముల ప్రెజెంటేషన్ బాగున్నా నాగ్ దక్కించుకున్న ప్రయోజనం తక్కువే.
సో అందుకే వాళ్ళు స్పెషల్ రోల్స్ వద్దని అంటున్నారు. అయితే సూర్య హీరోగా హెచ్ వినోత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నాగార్జునకో ప్రత్యేక పాత్ర ఆఫర్ చేశారనే వార్త చెన్నై వర్గాల్లో బలంగా తిరుగుతోంది. ఎంత ప్రాధాన్యం ఉందనేది పక్కనపెడితే తమిళ డైరెక్టర్లు టాలీవుడ్ స్టార్లను బాలన్స్ చేయడం గురించి అనుమానాలైతే లేకపోలేదు. సూర్య తమ్ముడు కార్తీతో కలిసి నాగార్జున గతంలో ఊపిరి చేశారు. అందులో కథ ఆయన చుట్టే తిరుగుతుంది.
మరి ఇది నిజంగా జరుగుతుందా లేక ప్రచారం దగ్గర ఆగుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి అభిమానులు అలా అనుకోవడమే కానీ ఇలాంటి ప్రయోగాలు, పాత్రలు చేయడం నాగార్జునకు కొత్త కాదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హిందీలో ఇలాంటివి చాలా చేశారు. అగ్ని వర్ష, మిస్టర్ బేచారా, ఎల్ఓసితో పాటు అధిపతి, నిన్నే ప్రేమిస్తాలో స్పెషల్ రోల్స్ చేశారు. సో సూర్య 49కి ఎస్ చెప్పినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. అధికారికంగా చెప్పే దాకా ఆగాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
