ఇరుముడి సినిమాలో లీడ్ రోల్ చేసింది టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రవితేజ. ఆయన నుంచి వచ్చిన చివరి ఆరు సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్లే. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ చివరి రెండు సినిమాలు నిరాశ పరిచాయి. నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ కూడా సక్సెస్ లో లేదు. ఈ సినిమా మీద పెట్టిన బడ్జెట్ ఏమో రూ.45 కోట్లు. సినిమా సిద్ధం అవుతున్న దశలో ఆ మొత్త రికవర్ అయ్యి రవితేజకు ఒక మోస్తరు విజయం దక్కినా చాలు అనే దశలో ఉన్నారు అభిమానులు.
అలాంటిది ఈ సినిమా పది రోజుల్లోనే దాదాపు రూ.180 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటేసింది. ఇంకా కూడా ఆ సినిమా జోరు తగ్గట్లేదు. రెండో సోమవారం కూడా మంచి ఆక్యుపెన్సీలతో కళకళలాడుతున్నాయి ‘ఇరుముడి’ థియేటర్లు. వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ మార్కును దాటేసింది. ఈ సినిమాను కొన్న ప్రతి బయ్యర్ మూణ్నాలుగు రెట్ల లాభాలు అందుకుంటుండడం విశేషం. దీన్ని బట్టి ఈ సినిమా ఏ స్థాయి సక్సెసో అర్థం చేసుకోవచ్చు.
నార్మల్ టికెట్ల రేట్లతో రిలీజ్ చేయడం, పెయిడ్ ప్రిమియర్స్ వేయకపోవడం వల్ల ‘ఇరుముడి’ నంబర్స్ కొంచెం చిన్నవిగా కనిపిస్తున్నాయి కానీ.. ఈ సినిమా లెవెలే వేరు అని చెప్పాలి. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు రికార్డులను సైతం బద్దలు కొట్టే రేంజిలో బాక్సాఫీస్ విధ్వంసాన్ని సాగిస్తోంది ‘ఇరుముడి’. రెండో శుక్రవారం ‘బాహుబలి-2’ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి ఈ చిత్రానికి. ఇక కొవిడ్ తర్వాత నైజాం (తెలంగాణ)లో అత్యధిక ఫుట్ ఫాల్స్ నమోదైన చిత్రంగానూ ‘ఇరుముడి’ రికార్డు నెలకొల్పినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.
అంటే ‘ఆర్ఆర్ఆర్’ కంటే కూడా ‘ఇరుముడి’కి ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయట. బాహుబలి-2, బాహుబలి చిత్రాలు మాత్రమే దీని కంటే ముందున్నట్లు సమాచారం. ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి మరో రికార్డును ‘ఇరుముడి’ దాటేసింది. సీడెడ్ (రాయలసీమ)లో రెండో సోమవారం 1.01 కోట్ల షేర్ సాధించింది. ఒక్క బాహుబలి-2 మాత్రమే రెండో సోమవారం దీని కంటే ఎక్కువగా రూ.1.10 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్ అయ్యేసరికి ‘ఇరుముడి’ ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
