40 రోజుల్లో 750 కోట్లు… మమిత మ్యాజిక్


ప్రేమలు మూవీతో సౌత్ ఇండియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మామిత బైజు. ఆ తరువాత డ్యూడ్ కూడా ఆమెకు మంచి పేరుతో పాటు విజయాన్ని కూడా అందించింది. ఐతే కర సినిమాతో మామిత కెరీర్ కొంచెం డౌన్ అయినట్లు కనిపించింది. కానీ గత 40 రోజుల వ్యవధిలో మామిత జోరు మామూలుగా లేదు. ఆమె నటించిన మూడు సినిమాలు చాలా తక్కువ టైంలో రిలీజ్ అయి రూ.750 కోట్ల మేర వసూళ్లు సాధించడం విశేషం.

సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విజయ్ మూవీ అనేక వాయిదాల తర్వాత జులై 23న విడుదలైన సంగతి తెలిసిందే. మామిత కీలక పాత్ర చేసిన ఈ చిత్రం బ్యాడ్ టాక్ ను తట్టుకుని ఫుల్ రన్లో 330 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇక సూర్యకు జోడిగా మామిత నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. విడుదలైన మూడో వారంలో కూడా మంచి వసూళ్లు సాధిస్తూ ఈ చిత్రం ఆల్రెడీ 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది.

మరోవైపు మామిత తన మాతృ భాష మలయాళంలో నివిన్ పౌలీ సరసన బెత్లెహాం కుడుంబ యూనిట్ అనే మరో ఫీల్ గుడ్ మూవీ చేసింది. ఈ క్లాస్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోంది. రెండు వారాలు తిరక్కుండానే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును అందుకుంది. ఇలా 40 రోజుల వ్యవధిలో మామిత బాక్సాఫీస్ కౌంట్ రూ.750 కోట్లకు చేరుతోంది.

విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహాం కుడుంబ యూనిట్ ఫుల్ రన్ అయ్యేసరికి ఈ లెక్క 800 కోట్ల మార్కును కూడా అందుకోవచ్చు. ఇప్పటిదాకా 50 లక్షలకు అటు ఇటుగా పారితోషకం అందుకుంటున్న మామిత ఇప్పుడు కోటి నుంచి కోటిన్నర దాకా డిమాండ్ చేసే స్థాయికి చేరుకున్నట్లు సమాచారం.