రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు కొట్టేంత సక్సెస్ అంచనాలకు అందడం లేదు. ఆరో రోజు కూడా ఎనభై శాతం ఆక్యుపెన్సీ నమోదు చేస్తూ సంక్రాంతి సినిమాలకు కూడా సాధ్యం కాని ఫీట్లు చూపించడం చూసి ట్రేడ్ వర్గాలకు నోటమాట రావడం లేదు. కొన్ని చోట్ల ఈ మూవీ తీసేసి టాక్సిక్ కి ఇచ్చారని ప్రేక్షకులు ధర్నాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మాములుగా ఏ హీరోకైనా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమాపై అంచనాలు, బిజినెస్ విపరీతంగా పెరిగిపోతాయి. ఒక్కోసారి వీటిని అందుకోలేక యావరేజులు సైతం డిజాస్టర్లుగా నిలిచిన దాఖలాలు బోలెడున్నాయి. ఇప్పుడే రవితేజ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది. ఇరుముడిలో సీరియస్ గా చేసిన పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. కామెడీ పెద్దగా లేదు. ఎప్పుడో భద్ర, విక్రమార్కుడులో చూసిన డెప్త్ ని జనం మళ్ళీ ఇందులో ఫీల్ అయ్యారు.

సో ఇకపై రవితేజ ఎలా కనిపిస్తాడనేది కీలకం కానుంది. శ్రీవిష్ణుతో కలిసి హసిత్ గోలి డైరెక్షన్లో త్వరలోనే కొత్త సినిమా మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. టైటిల్ చూస్తేనేమో అవుట్ అండ్ అవుట్ కామెడీ అనిపిస్తోంది. రవితేజ ఎనర్జీ గురించి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఇరుముడి హ్యాంగోవర్ లో ఉన్న పబ్లిక్ కి మాస్ మహారాజా అదే పనిగా నవ్వించాలంటే దాని వెనుక బలమైన రచన దర్శకత్వం ఉండాలి. అది హసిత్ చేతిలోనే ఉంది.

సరిపోదా శనివారం తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న వివేక్ ఆత్రేయ కూడా రవితేజ కోసం స్క్రిప్ట్ రెడీ చేశారు. అది మాస్ టచ్ తో ఉంటుందట. మార్కెట్ ని పెంచుకుంటూ పోవాలంటే కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలే కరెక్ట్. నాని దసరా నుంచి ప్యారడైజ్ దాకా ఒక క్రమ పద్ధతి ప్రకారం అదే చేస్తూ వచ్చాడు. గతంలో రవితేజ వాడిన స్ట్రాటజీ ఇదే. తిరిగి దాన్నే ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇరుముడిని దాటేలా హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ తమ బెస్ట్ ఇవ్వాల్సిందే.