సెంచరీ దాటేసినా ఇరుముడి తగ్గట్లేదు  

టాక్సిక్ విడుదల వల్ల చాలా చోట్ల ఇరుముడి థియేటర్లు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. ఇది ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగమే అయినా డిమాండ్ సప్లై సూత్రం పాటించలేక ఎగ్జిబిటర్లు యమ యాతన అనుభవిస్తున్నారు. ఎందుకంటే వీక్ డేస్ లో సెలవు రావడం తక్కువ. మిలాద్ నబి బుధవారం రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం మంగళవారం సాయంత్రం షోల నుంచే మొదలయ్యింది. ఫలితంగా నాలుగైదు టికెట్లు కావాలంటే రికమండేషన్లు ఉండాల్సిందే.

పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే అప్పటికప్పుడు చాలా మల్టీప్లెక్సులు షోలు సర్దలేక కిందా మీదా పడుతున్నారు. టాక్సిక్ టాక్ మెల్లగా బయటికి వస్తున్న నేపథ్యంలో వీకెండ్ మళ్ళీ రవితేజకే దక్కుతుందనే ముందస్తు అంచనాలు సోషల్ మీడియాలో జోరుగా ఉన్నాయి. తక్కువ స్క్రీన్లు ఉన్న చిన్న కేంద్రాల్లో ఇరుముడి సిచువేషన్ ఇరుకైపోయింది. విశ్వనాథ్ అండ్ సన్స్ ఇంకా రన్ లో కొనసాగడం అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. అయినా సరే ఇరుముడి తగ్గడం లేదు.

తాజాగా వంద కోట్ల మార్కుని దాటేసిన ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ఇంకో యాభై కోట్ల మీద కన్నేసింది. ఇది ఈజీనే కానీ అభిమానులు కోరుకుంటున్న డబుల్ సెంచరీని రవితేజ ఇరుముడితో చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ స్థాయి కంటెంట్ ఉన్న చిత్రాలు సెప్టెంబర్ 3, 4 తేదీలో పెద్దగా లేవు. బజ్ ఉన్నవి వస్తున్నాయి కానీ ఇరుముడిని ఇబ్బంది పెట్టేంత సీన్ లేకపోవచ్చు. దీంతో సహజంగానే రెండు వారాంతాలు రవితేజ ఆధిపత్యంలో సాగుతాయి.

విచిత్రం ఏమిటంటే కొన్ని సెంటర్లలో ఆర్ఆర్ఆర్, బాహుబలి, పుష్ప రేంజ్ ఫుట్ ఫాల్స్ చూస్తున్నామని, రిటర్న్ క్రౌడ్స్ చూసి నెలలు దాటిపోయిందని, అది ఇరుముడి సాధ్యం చేసిందని బయ్యర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ హైక్స్ తీసుకోకపోవడం చాలా ప్లస్ అయ్యింది. ఏపీలో వంద రూపాయలకే సింగల్ స్క్రీన్ బాల్కనీలో చూసే అవకాశం ఉండటం ఎక్కువ జనాన్ని ఆకట్టుకుంటోంది. మల్టీప్లెక్స్ కూడా గరిష్టంగా 177 రూపాయలే. సో సెప్టెంబర్ లో కూడా ఈ జోరు కొనసాగనుంది.