కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం తీసుకుని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దీన్ని తీర్చిదిద్దిన విధానం గురించి తమిళంలో ప్రశంసలు వచ్చాయి. వసూళ్లు మరీ అద్భుతాలు చేయలేదు కానీ ఉన్నంతలో రిసీవింగ్ ఓ మోస్తరుగా సాగింది. ఇక్కడ వర్కౌట్ అవ్వొచ్చనే ఉద్దేశంతో దగ్గుబాటి రానా బాధ్యత తీసుకుని వారం గ్యాప్ లో తెలుగు వెర్షన్ డబ్బింగ్ చేయించి థియేటర్ రిలీజ్ దాకా తీసుకొచ్చాడు.

కానీ డోరతీకి మనోళ్లు హారతి పట్టలేదు. కారణం కథాంశం ప్లస్ టేకింగ్. ఒక పల్లెటూరిలో రౌడీలుగా పెరిగిన ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితంలో ఒకరికి వదిన రూపంలో డోరతీ అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని తను చనిపోతుంది. అక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. స్నేహం నుంచి కథ కొత్త మలుపులు తిరిగి స్వలింగ ఆకర్షణ దాకా వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టుతో ముగింపు ఇచ్చి ఆడియన్స్ ని ఆలోచనలో పడేస్తారు.

సెన్సిటివ్ ఇష్యూ వరకు తీసుకోవడం బాగానే ఉంది కానీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో కార్తీక్ సుబ్బరాజ్ సక్సెస్ కాలేకపోవడంతో డోరతీ ఖచ్చితంగా చూడాల్సిన క్యాటగిరీలోకి పడలేదు. పైగా సమాజం ఇప్పుడప్పుడే అంగీకరించలేని కొన్ని విషయాలను తెరపైకి తీసుకురాకపోవడం ఉత్తమం. కార్తీక్ సుబ్బరాజ్ ఆ సాహసం చేయడంతో పాటు చెప్పాలనుకున్న సందేశాన్ని ఓవర్ ఎమోషన్స్ తో డిటైల్డ్ గా చూపించే ప్రయత్నం సాధారణ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

మొత్తానికి తెలుగులో డోరతీ ప్రయాణం డిజాస్టర్ వైపే జరిగింది. కొత్త రిలీజులు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, సిగ్మా, తెల్లకాగితం, డోరేమాన్, ఎస్ఐ యుగంధర్, బాలీవుడ్ మూవీ దృశ్యం 3, ప్యారడైజ్ సెకండ్ వీక్ ఉండటం వల్ల స్క్రీన్ల సర్దుబాటు ఇబ్బందిగా మారింది. కొన్ని సెంటర్లలో డోరతీకి ఒకటి రెండు షోలు మాత్రమే దక్కాయి. మాస్ జనాలకు ఎక్కే కాన్సెప్ట్ కాకపోవడంతో వాళ్ళు దూరంగా ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే కీర్తి సురేష్ పాత్ర సినిమా మొత్తం ఉండదు. అయినా ఆమెనే హైలైట్ చేస్తూ పబ్లిసిటీ చేశారు.