త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను గొప్ప‌గా ప్రోత్స‌హిస్తార‌ని వారి మీద‌ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసేది. ఆ టైంలో తెలుగు ప్రేక్ష‌కుల టేస్టు మీద సెటైర్లు ప‌డేవి. త‌మిళులే ఈ విష‌యంలో ముందుండేవాళ్లు. కానీ గ‌త కొన్నేళ్ల‌లో సీన్ రివ‌ర్సైంది. మ‌న వాళ్లు ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల‌కు ప‌ట్టం క‌డుతున్నారు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను బాగా ప్రోత్స‌హిస్తున్నారు.

కానీ ఇప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల తీరు మారిపోయింది. వాళ్లు రొటీన్, మాస్, మూస సినిమాల‌నే నెత్తిన పెట్టుకుంటున్నారు. డిఫ‌రెంట్ మూవీస్‌ను లైట్ తీసుకుంటున్నారు. విజయ్, అజిత్ చేసిన ఎన్నో రొటీన్ సినిమాల‌కు వాళ్లు ఎంత భారీ వ‌సూళ్లు ఇచ్చారో తెలిసిందే. సూర్య విష‌యానికి వ‌స్తే.. స‌మ్మ‌ర్లో అత‌ను క‌రుప్పు అనే రెగ్యుల‌ర్ మాస్ మూవీ చేశాడు. ఆ చిత్రాన్ని త‌మిళులు బ్లాక్ బ‌స్ట‌ర్ చేశారు. ఏకంగా రూ.300 కోట్ల వ‌సూళ్లు ఇచ్చారు.

త‌మిళ‌నాడు వ‌ర‌కే ఆ సినిమా రూ.155 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట్ చేసింది.
కానీ సూర్య నుంచి ఇప్పుడు విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ లాంటి డిఫ‌రెంట్ మూవీ వ‌చ్చింది. 42 ఏళ్ల వ్య‌క్తికి, 22 ఏళ్ల అమ్మాయికి మ‌ధ్య న‌డిచే వినూత్న ప్రేమ‌కథ ఇది. ఈ కాన్సెప్ట్‌కు ఫ్యామిలీ ఎమోష‌న్ల‌ను జోడించి చ‌క్క‌గా తీర్చిదిద్దాడు తెలుగు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. క‌రుప్పు కోసం ఎగ‌బ‌డ్డ త‌మిళ ప్రేక్ష‌కులు ఈ సినిమాను మాత్రం అనుకున్నంత‌గా ఆద‌రించ‌లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత‌మాత్రంగా న‌డిచాయి. పాజిటివ్ టాక్ వ‌చ్చాక వీకెండ్ వ‌ర‌కు సినిమా ప‌ర్వాలేద‌నిపించినా.. ఆ త‌ర్వాత స్లో అయిపోయింది.

ఇప్ప‌టిదాకా త‌మిళ‌నాడులో ఈ చిత్రం రూ.50 కోట్ల‌కు అటు ఇటుగా వ‌సూళ్లు సాధించిందంతే. ఫుల్ ర‌న్లో ఈ సినిమా క‌రుప్పు క‌లెక్ష‌న్ల‌తో పోలిస్తే రెండో వంతు క‌లెక్ష‌న్ మాత్ర‌మే సాధించేలా ఉంది. అక్క‌డ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా అవ్వ‌దంటున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజైన ప్ర‌తి చోటా సూప‌ర్ హిట్, బ్లాక్ బ‌స్ట‌ర్ రేంజిలోకి వెళ్తున్న సినిమా.. త‌మిళ‌నాట మాత్రం యావ‌రేజ్ రిజ‌ల్ట్‌తో స‌రిపెట్టుకోనుంది. గ‌త ఏడాది కుబేర లాంఇ మంచి సినిమాను ఫ్లాప్ చేసిన ఘ‌నులు త‌మిళులు. ఇప్పుడు విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌కు కూడా యావ‌రేజ్ రిజ‌ల్ట్‌తో స‌రిపెడుతున్నారు.