మాస్ రాజాకు ఈసారి కేక్ వాకేనా?

మాస్ రాజా ర‌వితేజ నిఖార్స‌యిన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. 2022లో వ‌చ్చిన ధ‌మాకా ఆయ‌న చివ‌రి స‌క్సెస్. అంత‌కుముందు కూడా కొన్నేళ్ల పాటు ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. ధ‌మాకా త‌ర్వాత ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్, ఈగ‌ల్, మాస్ జాత‌ర‌ చిత్రాల‌తో ర‌వితేజ ఫెయిల్యూర్ల‌లో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇలాంటి ఫ్లాప్ స్ట్రీక్ త‌ర్వాత కొత్త సినిమాకు బ‌జ్ తీసుకురావ‌డం చాలా క‌ష్టం. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ర‌వితేజ లేటెస్ట్ ఫిలిం ఇరుముడి ప్రేక్ష‌కుల్లో బాగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఈ శుక్ర‌వారం విడుద‌ల‌య్యే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ గ‌ట్టిగా జ‌రుగుతున్నాయి. అయ్య‌ప్ప మాల నేప‌థ్యంలో క‌థాంశాన్ని ఎంచుకోవ‌డం సినిమాకు బాగానే ప్ల‌స్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త నాలుగేళ్ల‌లో ఒక్క‌సారీ బ్రేక్ ఈవెన్ సాధించ‌లేక‌పోయిన ర‌వితేజకు ఈసారి మాత్రం అది కేక్ వాకే అనిపిస్తోంది. రూ.45 కోట్ల బ‌డ్జెట్లో ఇరుముడి చిత్రాన్ని నిర్మించింది మైత్రీ మూవీ మేక‌ర్స్. నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల ద్వారా బాగానే గిట్టుబాటు అయిన‌ట్లు తెలుస్తోంది.

వ‌ర‌ల్డ్ వైడ్ ఈ చిత్ర థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను రూ.20 కోట్లకు అమ్మారు. రూ.45 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధిస్తే ఇరుముడి బ్రేక్ ఈవెన్ అవుతుంది. విదేశాల్లో గ్రాస్ వ‌సూళ్ల నుంచి వ‌చ్చే షేర్ ప‌ర్సంటేజీ త‌క్కువ కాబ‌ట్టి.. సాధించాల్సిన షేర్ రూ.20 కోట్లే అయినా, ఓవ‌రాల్ గ్రాస్ రూ.45 కోట్ల దాకా రాబ‌ట్టాల్సి ఉంది.

ఇరుముడికి జ‌రుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే.. సినిమాకు తొలి రోజు డ‌బుల్ డిజిట‌ల్ ఓపెనింగ్ ఖాయంగా క‌నిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే.. వీకెండ్లోనే సినిమా బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్లిపోవ‌చ్చు. ప్రోమోలు చూస్తే సినిమా మినిమం గ్యారెంటీ అన్న‌ట్లు కనిపిస్తోంది.

సినిమాకు బ‌జ్ కూడా బాగానే ఉంది కాబ‌ట్టి ఈసారి ర‌వితేజ హిట్టు కొట్ట‌డం లాంఛ‌న‌మే కావ‌చ్చు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌వితేజ‌ అయ్య‌ప్ప భ‌క్తుడైన ఆటో డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న త‌మిళ అమ్మాయి ప్రియ భ‌వానీ శంక‌ర్ న‌టించింది. ఇందులో కీల‌క‌మైన హీరో కూతురి పాత్ర‌లో న‌క్ష‌త్ర అనే బాల న‌టి క‌నిపించ‌నుంది.